
ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి
కుందుర్పి/బెళుగుప్ప: ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు ఆన్‌లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు బిల్లులు జమ అవుతాయని, ఇందుకు ప్రతి కూలీ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని డ్వామా పీడీ సలీంబాసా తెలిపారు. కుందుర్పి మండలం మలయనూరు, నిజవళ్లి, కుందుర్పి, బెళుగుప్ప మండల కేంద్రంలో ఉపాధి సిబ్బంది శుక్రవారం చేపట్టిన ఈ–కేవైసీ నమోదు ప్రక్రియను శుక్రవారం ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. ఇకపై కూలి పనికి వెళ్లిన కూలీలకు మాత్రమే బిల్లులు చెల్లింపులు ఉంటాయన్నారు. లోకేషన్ ఆధారంగా పనుల్లో పాల్గొనే కూలీలను రెండు సార్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారన్నారు. బిల్లులు చెల్లింపులో ఇకపై ఎలాంటి అవకతవకలకు అస్కారముండదని పేర్కొన్నారు. గడువులోపు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కుందుర్పి ఎంపీడీఓ మాధవి, ఏపీఓ మురళీధర్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.