
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● పాత్రికేయులకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సూచన
రాయదుర్గంటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయులు కూడా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పాత్రికేయులకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ సూచించారు. రాయదుర్గంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో రెండు రోజుల పాటు సాగే జర్నలిస్టుల శిక్షణ తరగతులను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా యూనియన్ నాయకులు భోగేశ్వరరెడ్డి తదితరులతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోందని, దీనిపై కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, మహమ్మద్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
వీఏఏకు షోకాజ్
అనంతపురం అగ్రికల్చర్: ఆర్‌ఎస్‌కే వేదికగా రైతులకు విక్రయించిన ఎరువులకు సంబంధించి మార్క్‌ఫెడ్‌కు కట్టాల్సిన సొమ్ము వెంటనే చెల్లించాలని కూడేరు–2 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ) కె.నరేష్‌కుమార్‌కు జేడీఏ ఉమామహేశ్వరమ్మ షోకాజ్ నోటీసు జారీ చేశారు. గార్లదిన్నె మండలం మర్తాడు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఎరువుల సొమ్ము రూ.1,08,478 చెల్లించకుండా సొంతానికి వాడుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కూడేరుకు బదిలీ అయిన నేపథ్యంలో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల్లోపు మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమ చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వలస కార్మికుల మృతి
రాయదుర్గం టౌన్: బెంగళూరులో చోటు చేసుకున్న ప్రమాదంలో రాయదుర్గానికి చెందిన వలస కార్మికుడు మృతి చెందాడు. వివరాలు... స్థానిక అంబేడ్కర్ నగర్ ఫస్ట్ క్రాస్‌లో నివాసముంటున్న నాగరాజు (37)కు భార్య గాయత్రి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే బేల్దారి మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి నెలమంగల ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.
● తాడిపత్రి టౌన్: మండలంలోని అయ్యవారిపల్లి సమీపంలో ఉన్న సుగుణ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికుడు పురుషోత్తం నిషాద్ (31) మృతి చెందాడు. యూపీకి చెందిన పురుషోత్తం నిషాద్ గురువారం రాత్రి తాడిపత్రి మండలం బుగ్గ వద్దకెళ్లి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మత్తులో వాహనాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డాడు. అటుగా వెళుతున్న వారు గమనించి క్షతగాత్రుడిని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తనకు ఫ్యాక్టరీ యాజమాన్యం కేటాయించిన గదికి వెళ్లిన పురుషోత్తం నిషాద్.. శుక్రవారం ఉదయం అల్ఫాహారం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.