
ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఇద్దరి అరెస్ట్
● సింగిల్ బారెల్ రైఫిల్, సెల్‌ఫోన్లు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్
పుట్టపర్తి టౌన్: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాజాద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలమ్ షేక్‌ను శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్, ఫోన్‌కాల్స్ ద్వారా సంబంధాలు నెరపడంతో అతన్ని ఈ ఏడాది ఆగస్టు 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా..ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాజాద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలమ్ షేక్ పాత్ర తేలింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందం ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఆ రాష్ట్రంలోని అమ్రోహోలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సాజాద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసింది. అతని నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాద్ మెటీరియల్ స్వాధీనం చేసుకుంది. అదే రోజు ఆంఽధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఏటీఎస్ బృందాలు దాడులు నిర్వహించి..మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో మాలేగావ్‌లో తౌఫీక్ ఆలమ్‌షేక్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అతని నుంచి సింగిల్ బారెల్ రైఫిల్, సెల్‌ఫోన్లు, జిహాద్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాయి. వీరిద్దరూ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఆధారిత వాట్సాప్ గ్రూప్‌లు, చానల్స్‌లో కూడా క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. వీరు యువతను జిహాదీ వైపు మళ్లించడంతో పాటు పాకిస్థాన్‌లో మిలటరీ శిక్షణ తీసుకుని భారతదేశంపై యుద్ధం చేయాలని యోచిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన ఇద్దరినీ పుట్టపర్తి మేజిస్టేట్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
పీఎఫ్‌ఐ ప్రతినిధుల జిహాదీ కార్యకలాపాలు
దేశంలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ప్రతినిధులు ఇతర నిషేధిత సంస్థలతో సంబంధాలు పెట్టుకుని సామాజిక సేవ పేరుతో జిహాదీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పాక్ ఆధారిత సోషల్ మీడియా గ్రూపులపై గట్టి నిఘా ఉంచామన్నారు. యువత సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సందేహాస్పద కార్యకలాపాలు, దేశ వ్యతిరేక, రాడికల్ భావాలను ప్రోత్సహించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. నిందితుల అరెస్టుకు శ్రమించిన ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌తో పాటు ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు, ముదిగుబ్బ సీఐ శివరాముడు తదితరులు పాల్గొన్నారు.