
ఎత్తిపోతల పథకంలో సాంకేతిక సమస్య
● ఒక్కసారిగా ఆగిపోయిన మోటర్లు
● మరమ్మతుల అనంతరం మళ్లీ నీటి పంపింగ్
వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఎత్తిపోతల పథకంలో శుక్రవారం తెల్లవారుజామున సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నీటిని ఎత్తిపోస్తున్న తొమ్మిది మోటర్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. రాగులపాడు లిఫ్ట్‌కు 2,800 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. అయితే కొన్ని గంటలకే కాలువలో నీటిమట్టం పెరిగిపోయింది. అప్రమత్తమైన లిఫ్ట్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ నాగరాజు, ఎస్‌ఈ రాజ్‌స్వరూప్, ఈఈ శ్రీనివాస్‌నాయక్, డీఈ వెంకటరమణ, జేఈ సురేష్‌నాయక్ తదితరులతో పాటు మరికొందరు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని మోటర్లను పరిశీలించారు. కాలువలో నీటి మట్టం పెరగడంతో అధికారులు ఛాయాపురం వద్దకు చేరుకుని ఎస్కేప్ చానల్ వద్ద జేసీబీతో నీటిని మళ్లించారు. అనంతరం నాలుగు పంపుల ద్వారా నీటి పంపింగ్ ప్రారంభించారు. ఇంజినీరింగ్ అధికారుల బృందం రాగులపాడు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని మరమ్మతులు ప్రారంభించింది. మధ్యాహ్నం నుంచి తిరిగి తొమ్మిది పంపుల ద్వార నీటి పంపింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు, వజ్రకరూరు తహసీల్దార్ నరేష్‌కుమార్, ఉరవకొండ సీఐ మహానంది తదితరులు అక్కడకు చేరుకుని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఛాయాపు రం వద్ద ఎస్కేప్ ఛానల్ నుంచి కృష్ణా జలాలు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.