
వైద్యం అందక విలవిల
అనంతపురం మెడికల్: ప్రజల ఆరోగ్యం కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. సకాలంలో ఎన్టీఆర్ వైద్య సేవలందక రోగులు విలవిలలాడుతున్నారు. బకాయిలు పేరుకుపోయాయని నెట్‌వర్క్ ఆస్పత్రులు గుండె, కిడ్నీ, కేన్సర్ తదితర ప్రాణాంతక సమస్యలున్న కేసులను చూడకుండా తిరస్కరిస్తుండటంతో రోగులు తిరిగి ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వస్తున్నారు. అధిక సంఖ్యలో రోగులు వస్తుండటంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు అప్పోసప్పో చేసి ప్రైవేట్‌గా వైద్యం చేయించుకుంటున్నారు.
వైద్యమందక.. ప్రత్యక్ష నరకం
● కదిరికి చెందిన 59 ఏళ్ల వ్యక్తికి ఇటీవల గుండె నొప్పి వచ్చింది. హుటాహుటిన అనంతపురం సాయినగర్‌లోని ఓ కార్డియాక్ ఆస్పత్రికి వచ్చారు. అందులో వైద్యులు పరీక్షించి ‘యాంజియో’ చేయాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స చేయడం లేదని చెప్పడంతో.. రూ.18,000 వెచ్చించి సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది.
● అనంతపురానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు జారిపడి కాలు విరిగింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కుటుంబీకులు నెట్‌వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ లేదని చెప్పారు. దీంతో వృద్ధురాలు పని చేస్తున్న ఇంటి యజమాని ఆమెకు రూ.35,000 వెచ్చించి ఆపరేషన్ చేయించారు.
● గాండ్లపర్తికి చెందిన యువశ్రీ అనే గర్భిణి మూడవ ప్రసవం కోసం అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది. కాగా అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డెలివరీ చేయలేం అని చెప్పడంతో.. చేసేదిలేక ఆమెను సర్వజనాస్పత్రిలో చేర్చారు.
● జిల్లాలోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కార్డియాక్, నెఫ్రాలజీ సేవలను తిరస్కరించడంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేసులు అధికమయ్యాయి. సూపర్ స్పెషాలిటీలోని క్యాథ్‌ల్యాబ్‌లో ఉన్న 30 పడకలు నిండిపోయాయి. కేసులు పెరిగితే పరిస్థితేంటని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. జీజీహెచ్ నుంచి కేసులను రెఫర్ చేయవద్దంటూ చెబుతున్నారు. అదేవిధంగా డయాలసిస్ రోగుల పరిస్థితి అదే విధంగా ఉంది. రోజూ 70 నుంచి వంద మంది వరకు రోగులకు డయాలసిస్ చేయాల్సి ఉంది. కాగా వీరంతా సూపర్ స్పెషాలిటీ, సర్వజనాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
5 ప్రీ ఆథరైజేషన్లు మాత్రమే..
జిల్లాలోని 46 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో మంగళవారం 5 ప్రీ ఆథరైజేషన్లు మాత్రమే జరిగాయి. సాధారణంగా రోజూ 100 నుంచి 200 వరకు ప్రీ ఆథరైజేషన్లు జరిగేవి. అటువంటిది తక్కువ స్థాయికి పడిపోయాయంటే నెట్‌వర్క్ ఆస్పత్రుల నిరసన ఏ స్థాయికి చేరుకుందో తెలుస్తుంది.
నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు
జీజీహెచ్, సూపర్‌స్పెషాలిటీకి రోగుల క్యూ
ప్రజల ఆరోగ్యంపై పట్టనట్టు వ్యవహరిస్తున్న కూటమి సర్కారు