కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) వద్ద ఏర్పాటైన ఏపీ జెన్‌కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. డ్యాం నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే ప్రాంతంలోని గేట్ లింక్ దెబ్బతింది. దీంతో నీటిని విడుదల చేయడానికి గేట్ ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 5న జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 3 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు ఏపీ జెన్ కో జేఈ కిరణ్ తెలిపారు. బుధ, గురువారాల్లో గేట్ లింక్‌కు మరమ్మతులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్, జెన్‌కో సివిల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతులు పూర్తి కాగానే యథావిధిగా జల విద్యుత్‌ను ఒక టర్బైన్‌లో గంటకు 3 వేల చొప్పున రోజుకు సుమారు 72,500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జేఈ కిరణ్ తెలిపారు.
శిల్క్ సమగ్ర పథకానికి టెండర్లు
అనంతపురం అగ్రికల్చర్: శిల్క్ సమగ్ర–2 పథకానికి టెండర్లు ఆహ్వానించినట్లు పట్టు పరిశ్రమశాఖ జిల్లా అధికారి ఐ.విజయకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రొఫైలాక్టిక్ మెసర్స్ ఫర్ అస్యూర్డ్ కకూన్ ఈల్డ్’ కింద రైతులకు నాణ్యమైన క్రిమిసంహారక మందులు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన డీలర్లు ఈ నెల 25న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నెల 29న కలెక్టరేట్‌లో టెండర్లు ఫైనలైజ్ చేస్తామన్నారు. దరఖాస్తుదారులు ఈఎండీ రుసుం కింద రూ.62,500 డీడీ రూపంలో డీఎస్‌ఓ, పట్టు పరిశ్రమశాఖ పేరు మీద సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 86395 00606 నంబరులో సంప్రదించాలని సూచించారు.
పట్టుచీరల వ్యాపారి ఖాతాలో నగదు మాయం
యాడికి: సైబర్ నేరగాళ్లు పట్టుచీరల వ్యాపారి బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి దాదాపు రూ.4,22,215 మాయం చేశారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు పట్టుచీరల వ్యాపారి. ఈయనకు తాడిపత్రిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు మంగళవారం హ్యాక్ చేశారు. మొదటి విడతగా రూ.3,50,000 డ్రా అయినట్లు వ్యాపారి సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. అప్రమత్తమైన శ్రీనివాసులు వెంటనే బ్యాంకు సిబ్బందికి సమాచారాన్ని తెలిపేలోపు రూ.4,999 కట్ అయినట్లు మరో మెసేజీ వచ్చింది. ఇక మూడోసారి రూ.67,216 కట్ అయినట్లు మెసేజీ వచ్చింది. పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బు సైబర్ నేరగాళ్లు కొట్టేయడంతో శ్రీనివాసులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నేటి నుంచి
కోర్టు విధుల బహిష్కరణ
అనంతపురం : రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనంతపురం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సాధారణ సభ్యుల అత్యవసర సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. కర్నూలు పర్యటనకు వస్తున్న మోదీ రాయలసీమ ప్రజల ఆకాంక్ష అయిన హైకోర్టు ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జిల్లా కోర్టు విధులను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేశారు. రాజధాని ఆంధ్రా ప్రాంతంలో ఏర్పాటైతే.. హైకోర్టు సీమలో ఏర్పాటు చేయాలని, రాయలసీమలో రాజధాని ఏర్పాటైతే ఆంధ్రా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నాడు జరిగిన పెద్దమనుషుల ఒప్పందాన్ని అనంతపురం బార్ అసోసియేషన్ సెక్రెటరీ ఈ.వెంకట్రాముడు ఉటంకించారు. హైకోర్టు సీమ ప్రజల హక్కు అని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్‌యూ) రాష్ట్ర నాయకులు సూర్యచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
పీఏబీఆర్‌లో ఆగిన జల విద్యుత్ ఉత్పత్తి