
తప్పుమీద తప్పు చేస్తున్న ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాష్ట్రంలో బయట పడిన నకిలీ మద్యపు డంపులు, ఫ్యాక్టరీల వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టను దేశ వ్యాప్తంగా బజారుపాలు చేసింది. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తోంది’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ విచారణ కోరుతున్నామని చంద్రబాబు చెబితే హుందాగా ఉండేదన్నారు. సీబీఐ విచారణ జరపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారన్నారు. నకిలీ మద్యం కుంభకోణం వెనుక రాష్ట్ర పెద్దల హస్తం ఉందని ప్రజలు నమ్ముతుండడంతో దిగజారుతున్న ప్రభుత్వ పరువును నిలబెట్టుకునే క్రమంలో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ముద్దాయి మాట్లాడినట్లు ఒక వీడియో విడుదల చేశారన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మళ్లించేందుకే జోగి రమేష్ మీద అభాండాలు, మిథున్‌రెడ్డి కంపెనీల్లో ‘సిట్’ సోదాలతో హడావుడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బేవరేజస్ కంపెనీల నుంచి కాకుండా ప్రైవేట్‌గా నకిలీ మద్యం అమ్మకాలతో రూ.15 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.
అతిపెద్ద భూ కబ్జా కనిపించలేదా?
రాష్ట్రంలో ఎన్నడూ చూడని భూకబ్జా అనంతపురం నగర శివారులోని పాపంపేట పొలంలో చేస్తున్నారన్నారు. 930 ఎకరాల శోత్రియం భూముల్లో నివాసం ఉంటున్న 15 వేల కుటుంబాల ఇళ్లు, స్థలాలను కచ్చా భూములుగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పాగా వేయాలని చూస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, టీడీపీ, సీఎంఓ, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు స్పందించలేదన్నారు.
కందికుంట ప్రసాద్‌కు బాధ ఎందుకో..?
రూ.కోట్లు విలువైన భూములు కబ్జా చేస్తున్న పరిటాల సునీత బంధువుల వ్యవహారంపై విమర్శిస్తే కందికుంట ప్రసాద్‌కు ఎక్కడ బాధ అయ్యిందో అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయింది వాస్తవమో కాదో మంత్రి పార్థసారథిని అడిగి తెలుసుకోవాలన్నారు. ధర్మవరంలో నేసేవారితో రూ.కోట్లు వసూళ్లు చేసింది పరిటాల శ్రీరామో కాదో మీ కుల పెద్దలను అడిగినా, మంత్రి సత్యకుమార్‌ను అడిగినా చెప్తారన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడానికి మీకు, నాకు పొలం గట్ల తగదాలేవీ లేవన్నారు. ‘రూ.3 కోట్ల కారు అనేది పెద్ద విషయమా? ఏడుసార్లు గెలిచిన కుటుంబం వారి ట్రాక్ రికార్డు, రూ.150 కోట్లతో ఇల్లు కట్టుకోకూడదా? రూ. 15 కోట్లు విలువ చేసే కార్లు ఉండకూడదా? రూ.1000 కోట్ల ఆస్తులు వారు సంపాదించుకోకూడదా?’ అంటూ కందికుంట వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు కిందకు ఇంకవని, లక్షల ఎకరాల భూములు బీళ్లుగా మారతాయని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏమి చేశావు కందికుంట ప్రసాద్ అని నిలదీశారు.
నీ అంత ట్రాక్ రికార్డు మాకు లేదు
కందికుంట ప్రసాద్ అంత ట్రాక్ రికార్డు తమకు లేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ‘డీడీల స్కాం కేసులో సీబీఐ నీపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అప్పీలు ౖఫైలెంది. ఇప్పుడు కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నువ్వు జైలుకు పోకుండా చూసుకో. ఇదీ నీ ట్రాక్ రికార్డు’ అని అన్నారు. ‘ఇక నా ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాలంటే... నేను రాజకీయాల్లోకి రాకముందే సిద్ధరాంపురంలో మా కార్యకర్తలకు మేము సొంతంగా డబ్బులిచ్చి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాం. 2013లో దాదాపు ఐదారు వేల మందికి ‘దీపం’ ధరతోనే గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాను. వేలాదిమంది రైతులకు ఉచితంగా బోర్లు వేయించి, గొర్రెలు, బర్రెలు ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఎంతైనా సంపాదించుకోవచ్చనే నీ విధానానికి మేము చాలా దూరంగా ఉన్నాం. కోవిడ్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి ఇచ్చాం. సహాయక చర్యల కోసం రూ.కోట్లు ఖర్చు చేశాం. పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా నీళ్లు తెప్పించాం’ అని వివరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, మద్దెలచెరువు సుధీర్‌రెడ్డి, లింగారెడ్డి, బండి పవన్, ఈశ్వరయ్య, నీరుగంటి నారాయణరెడ్డి, మీనుగ నాగరాజు తదతరులు పాల్గొన్నారు.
నకిలీ మద్యంపై ఎంపీ మిథున్‌రెడ్డి సీబీఐ విచారణ అడిగిన గంటల్లోనే ‘సిట్’ ఏర్పాటు
సీబీఐ విచారణ కోరతామని చంద్రబాబు చెబితే హుందాగా ఉండేది
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి