
మాటల్లోనే ఘనాపాటి.. అభివృద్ధి అధోగతి
అనంతపురం క్రైం: ఆయన మాటల్లోనే ఘనాపాటి.. చేతల్లో మాత్రం కాదు. ఆర్భాటంగా ప్రకటనలు చేయడమే కానీ ఆచరణలో చేసిందేమీ ఉండడం లేదు. కోటలు దాటుతున్న మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆశించినస్థాయిలో జరగడం లేదు. తాము అధికారంలోకి వస్తే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీ అమలులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విఫలమయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. మరి ఎక్కడ పనులు చేపట్టారో తెలియని పరిస్థితి. నగరం నలుమూలలా సరైన రోడ్లు లేవు. గుంతలు పడిన, కంకర తేలిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎ.నారాయణపురం బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతూనే ఉంది. రాజీవ్‌కాలనీ రహదారి నిర్మాణం అధ్వానంగా ఉంది. రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. అనంతపురం వేదికగా జరిగిన ‘సూపర్ సిక్స్’ సభ సందర్భంగా రూ.లక్షలు వెచ్చించి సప్తగిరి సర్కిల్‌లో రోడ్డు ప్యాచ్‌వర్కులు చేశారు. అయితే నాసిరకంగా చేపట్టడంతో ప్యాచ్‌వర్క్ కాస్తా తేలిపోయింది. వర్షాలు వచ్చినపుడు గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు అసౌకర్యంగా మారుతోంది. గుంతల్లో అదుపుతప్పి పలువురు ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ పాలనలోనే అభివృద్ధి పరుగులు
గత వైఎస్సార్‌సీపీ హయాం (2019–2024)లో అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టింది. నగరం అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి రహదారుల రూపురేఖలు మార్చేశారు. మురుగు కాల్వలు, శివారు ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టారు. రూ.375 కోట్లతో బళ్లారి బైపాస్ రోడ్డు నుంచి రాప్తాడు పంగల్ రోడ్డు దాకా రహదారి నిర్మాణం జరిగింది. క్లాక్ టవర్ – పీటీసీ వరకు ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ నగరానికే వన్నె తెచ్చిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
నగరంలో రోడ్లన్నీ గుంతలమయమే
నాసిరకం ప్యాచ్ వర్క్‌లతో తేలిన కంకర
ముందుకు సాగని నారాయణపురం వంతెన నిర్మాణం
కలగా మిగిలిన రాజీవ్ కాలనీ రహదారి నిర్మాణం
అనంతపురంలోని ప్రధానమైన కూడళ్లలో సప్తగిరి సర్కిల్ ఒకటి. ఇక్కడ రోడ్డుపై ఏర్పడిన గుంతలను కూటమి ప్రభుత్వం హడావుడిగా ‘ప్యాచ్ వర్క్’లో భాగంగా మరమ్మతు పనులు చేయించింది. పనులు చేయించిన కాంట్రాక్టర్ డబ్బు మిగుల్చుకోవడానికి నాసిరకంగా చేపట్టడంతో కొద్ది రోజులకే కంకర తేలిపోయింది. వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు.
ఇది విద్యుత్ నగర్‌కు వెళ్లే మార్గం. ఇక్కడ రోడ్డు కంకర తేలి ఉంది. వాహనాలు వెళ్లే సమయంలో కంకర రాళ్లు టైర్ల కిందపడి సమీపంలోని వారిపైకి దూసుకొస్తున్నాయి. కొందరు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇవేమీ పాలకుల కంటికి కనిపించడం లేదని వాహన దారులు మండిపడుతున్నారు.
గుంతలు పూడ్చండి
అనంతపురంలో ద్విచక్రవాహనం నడపాలంటే నరకమే. సప్తగిరి సర్కిల్ నుంచి సాయినగర్, రుద్రంపేట రోడ్డు, అరవిందనగర్, నాయక్ నగర్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గుంతలైనా పూడ్చి పుణ్యం కట్టుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఆ దిశగా దృష్టి సారించాలి.
– లక్ష్మణ్, సున్నంగేరి
అడుగు అడుగేయలేం
నగరంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లపై పెద్ద ఎత్తున నీరుపారుతోంది. అడుగు వేయలేని పరిస్థితి. ప్రధానంగా సఫ్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, తాడిపత్రి బస్టాండ్, అరవిందనగర్, వేణుగోపాల్ నగర్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు సర్కిల్, బళ్లారి బైపాస్ ఇలా చాలా కూడళ్లు, కాలనీలకు వెళ్లే రోడ్లు గుంతలు పడ్డాయి. కొన్ని కాలనీల్లో నడవడానికి కూడా అనువుగా లేవు. రోడ్ల మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలి.
– మహేష్, చిరువ్యాపారి, అనంతపురం

మాటల్లోనే ఘనాపాటి.. అభివృద్ధి అధోగతి

మాటల్లోనే ఘనాపాటి.. అభివృద్ధి అధోగతి

మాటల్లోనే ఘనాపాటి.. అభివృద్ధి అధోగతి