
మొక్కజొన్న పంట దగ్ధం
బెళుగుప్ప: మండలంలోని నక్కలపల్లిలో మహిళా రైతు హనుమక్క తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంగళవారం పూర్తిగా కాలిపోయింది. తోటలోని ట్రాన్స్‌ఫ్మార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసి పడడంతో మొత్తం మంటలు వ్యాపించాయి. రెండు ఎకరాల్లోని పంటతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయింది. కాలిపోయిన పంటను స్థానిక వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ పరిశీలించారు. నష్ట నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
25 లోపు పంట నమోదు పూర్తి కావాలి : డీఏఓ
బుక్కరాయసముద్రం: జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పంటలను ఈ నెల 25వ తేదీలో ఈ–క్రాప్ నమోదు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. బీకేఎస్, గోవిందపల్లి పంచాయతీలో సాగులో ఉన్న పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ–క్రాప్ నమోదైన పంట నష్టపోతే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు తప్పని సరిగా ఈ– క్రాప్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్యాంసుందరరెడ్డి, రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌లు ఇర్ఫాన్, విజయశాంతి, తిరుమలేష్, రైతులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయండి
● ధర్నాలో యుఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ రుష్యేంద్రబాబు
అనంతపురం అగ్రికల్చర్: ప్రైవేట్ బ్యాంకులను వెంటనే జాతీయం చేయాలని ఆల్ ఇండియా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు యూనియన్ (యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ డి.రుష్యేంద్రబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న కొటక్ బ్యాంకు ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రుష్యేంద్రబాబు మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న దమననీతిని ఎండగట్టారు. వీటిని జాతీయకరణ చేయడంతో పాటు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఉద్యోగులపై విధించిన క్రమశిక్షణా చర్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే క్యాథలిక్ సిరియన్ బ్యాంకుకు వేతన సవరణ అమలు చేయాలని, నైనింటాల్ బ్యాంకు మూసివేతను ఆపాలని, తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు ఉద్యోగుల వయోపరిమితి 60 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఉద్యోగ సంఘాల నాయకులు రఘునాథరెడ్డి, శివారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, శివానందగుప్తా, శంకర్, భారతి, మున్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంట దగ్ధం