
గుంతకల్లు ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్ విచారణ
గుంతకల్లు టౌన్: నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిపై రోగి, సహాయకులు దాడికి యత్నించి, స్టాఫ్‌నర్సులను దూషించిన ఘటనపై ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజన్ విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆస్పత్రికి విచ్చేసిన ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్‌రెడ్డితో పాటు ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడు సల్మాన్ జావేద్, స్టాఫ్‌నర్సులు, సెక్యూరిటీ గార్డులను పిలిచి ఘటనకు దారితీసిన కారణాలను విచారించారు. నిందితుల వివరాలు, పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు, వారిపై తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. సమగ్ర నివేదికను కలెక్టర్‌కు పంపనున్నట్లు డీసీహెచ్‌ఎస్ తెలిపారు. అలాగే ఆస్పత్రులు రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, ప్రతిరోజూ ఔట్‌పేషెంట్లు, సాధారణ కాన్పులు, తదితర విషయాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.
మూగజీవాలపై చిరుతల దాడి
కుందుర్పి: మండలంలోని కర్ణాటక సరిహద్దున ఉన్న కొత్తపల్లి గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన రెండు ఆవులపై మంగళవారం మధ్యాహ్నం చిరుతలు దాడి చేసి చంపేశాయి. అటవీవాఖ అధికారులు చర్యలు తీసుకుని చిరుత దాడుల్లో మృతి చెందిన మూగజీవాలకు పరిహారం అందించాలని బాధిత రైతులు మారెన్న, పెద్ద రామప్ప, రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు.