
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
● జెడ్పీ జీఈఓ శివశంకర్
గుమ్మఘట్ట: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జెడ్పీ సీఈఓ శివశంకర్ అన్నారు. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురంలో ఎంపీడీఓ జయరాములుతో కలిసి ఆయన పర్యటించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రంగారెడ్డి పాల్గొన్నారు.
జెడ్పీలో పదోన్నతుల కార్యాచరణ
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65 మందికి అవకాశం
అనంతపురం టవర్‌క్లాక్: జిల్లా పరిషత్ పరిధిలోని ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణను చేపట్టినట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య మంగళవారం తెలిపారు. సీనియర్ అసిసెంట్లు, గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,019 మందికి లబ్ధి చేకూరనుండగా ఇందులో ఉమ్మడి జిల్లాలో 65 మంది ఉండడం గమనార్హం. పది వేల జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి డిప్యూటీ ఎంపీడీఓను నియమించనున్నారు. దీంతో ఇకపై ఈఓఆర్డీలను డిప్యూటీ ఎంపీడీఓలుగా పిలువనున్నారు. పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 20 తేదీలోపు అధికారికంగా వెలువడనున్నట్లు తెలిసింది. త్వరలో కింది స్థాయి ఉద్యోగులకూ పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం.
వ్యక్తి దుర్మరణం
శింగనమల: కారు ఢీకొన్న ఘటనలో ఓ దిచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం సూరేపల్లికి చెందిన సూర్యనాగశేఖర్(52) మంగళవారం అనంతపురానికి వెళ్లి అక్కడ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. శింగనమల మండలం నాయనపల్లిక్రాస్‌లో టీ తాగిన అనంతరం 544–డీ జాతీయ రహదారిపైకి చేరుకునేందుకు యూటర్న్ తీసుకుంటుండగా తాడిపత్రి నుంచి బెంగుళూరుకు వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన సూర్యనాగశేఖర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు.