
నాడు గగ్గోలు.. నేడు గప్‌చుప్
అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు... నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపడం లేదంటూ ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరాయుడుు, కుళ్లాయిస్వామి మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో మంగళవారం జెడ్పీ కార్యాలయం ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రధానిపై ఎందుకు ఒత్తిడి తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. కనీసం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ కూడా శంకుస్థాపనలకే పరిమితం కావడం సిగ్గుచేటని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ.. గతంలో ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు.. తిరుపతి వెంకన్న సాక్షిగా.. ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అప్పట్లోనే చంద్రబాబు సైతం పదేళ్లు కాదు.. ఏకంగా పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారని, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తరువాతనే మోదీని ఏపీలో అడుగుపెట్టనిస్తామన్నారు. లేదంటే మోదీ పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు, జిల్లా ఆఫీస్ బేరర్స్ నరసింహ, వెంకట్ నాయక్, వంశీ, మంజునాథ్, ఉమామహేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అవకాశ వాద రాజకీయాలకు పరాకాష్ట
రాయలసీమ జిల్లాల్లో అడుగు పెట్టడానికి ప్రధాని మోదీ అనర్హుడు
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నినాదాలు