
ప్రజా శ్రేయస్సే లక్ష్యం
అనంతపురం కార్పొరేషన్: ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదింటి బిడ్డల వైద్య విద్య కలను ముఖ్యమంత్రి చంద్రబాబు చిదిమేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ‘వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వెఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను అనంత ఆవిష్కరించారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు కోటి మందితో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు. నవంబర్ 22 వరకు సంతకాల సేకరణ కొనసాగుతుందన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు భాగస్వాములు కావాలన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపడతామన్నారు.
నాడు ప్రజారోగ్యానికి పెద్దపీట
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన విషయాన్ని అనంత గుర్తు చేశారు. ఆస్పత్రుల అధునికీకరణ, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారన్నారు. వైద్య కళాశాలలు వస్తే అనుబంధంగా బోధనాస్పత్రులు వస్తాయని, సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు అందుతుందని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,300 కోట్లతో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. రెండేళ్లలోనే ఏడు వైద్య కళాశాలలు పూర్తి చేశారని, 2023–24లో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయని వివరించారు. మరో రెండు కళాశాలలు గతేడాది ప్రారంభించాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు తన బంధువులు, వర్గీయులకు లబ్ధి చేకూర్చడం కోసం కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నారన్నారు.
బాబుకు ప్రైవేటీకరణపైనే మోజు
చంద్రబాబుకు ప్రైవేటీకరణపై మోజు ఎక్కువ అని అనంత ధ్వజమెత్తారు. 1998లోనూ అనంతపురం మెడికల్ కళాశాలను ట్రస్ట్‌కు అప్పగించాలని ప్రయత్నించారని, అప్పుడు ప్రజా ఉద్యమం చేపడితే ఆయన దిగివచ్చారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు నూతన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థనాయక్, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, బాకే హబీబుల్లా, ఓబిరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు చింతకుంట మధు, ఆసిఫ్, శ్రీనివాస్ దత్తా, సత్రసాల మంజునాథ్, జావెద్, భారతి, రాధాయాదవ్, ఉషా, హజరాబీ, కై లాష్, సాకే కుళ్లాయస్వామి, మీసాల రంగన్న, తలారి వెంకటేష్, ఉదయ్, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, సాకే చంద్రలేఖ, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
నవంబర్ 22 వరకు కోటి సంతకాల సేకరణ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత