
గార్మెంట్స్ అభివృద్ధికి కృషి
● జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
రాయదుర్గంటౌన్: గార్మెంట్స్ పరిశ్రమ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఆయన రాయదుర్గం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గుమ్మఘట్టలోని భైరవానితిప్ప ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా రాయదుర్గంలోని కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ– పుర భవనం) పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సీఎఫ్‌సీ ద్వారా యూనిట్లు ప్రారంభించి మహిళా కార్మికులకు కుట్టు శిక్షణతోపాటు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది కొరతపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మెర్సీ జ్ఞానసుధను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం పట్టణంలోని బళ్లారి రోడ్డులోని శ్రీఆంజనేయస్వామి కల్యాణమంటపంలో దుకాణదారులు ఏర్పాటు చేసిన జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శనను తిలకించారు. ఎవరైనా జీఎస్టీ అమలును పట్టించుకోకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 74 ఉడేగోళంలోని టెక్స్‌టైల్స్ పార్కును తనిఖీ చేసి యూనిట్లు విస్తృతంగా నడిచేందుకకు ఔత్సాహికులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఆయనతోపాటు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయనతో కాసేపు చర్చించారు.
రూ.10 లక్షలు మంజూరు
గుమ్మఘట్ట: గుమ్మఘట్టలోని ఎంజేపీ గురుకుల పాఠశాల అభివృద్ధి పనుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తామని కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. శుక్రవారం గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన.. సమస్యలపై ప్రిన్సిపాల్ శ్రీదేవిని ఆరా తీశారు. అలాగే గోనబావి సమీపంలో అర్ధంతరంగా ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.