
బొమ్మనహాళ్‌లో కుండపోత వర్షం
న్యూస్‌రీల్
అనంతపురం అగ్రికల్చర్/ బొమ్మనహాళ్: జిల్లాలో రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 7.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 84.2 మి.మీ కుండపోత వర్షం కురిసింది. మండలంలోని సిద్దరాంపురం, చంద్రగిరి, కురువల్లి గ్రామల్లో వరి, మొక్కజొన్న, మిరప, జొన్న తదితర పంటలు నీటమునిగాయి. చంద్రగిరిలో గ్రామదేవత ఆలయంలోకి వర్షం నీరు చేరింది. రోడ్డుపై వర్షపు నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బండూరు వంక పారడంతో గోవిందవాడ, దర్గాహొన్నూరు తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా కూడా గ్రామాల్లో నిలిచిపోయింది. ఇక రాప్తాడు మండలంలో 41 మి.మీ, బెళుగుప్ప 24.8, కళ్యాణదుర్గం 21, పామిడి 20.4, బ్రహ్మసముద్రం 12 మి.మీతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురం, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు, కంబదూరు, శెట్టూరు, గుమ్మఘట్ట తదితర మండలాల్లో జడితో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 100.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 18.8 మి.మీ నమోదైంది.

బొమ్మనహాళ్‌లో కుండపోత వర్షం