
స్తంభించిన ఎన్టీఆర్ వైద్య సేవలు
● నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు బంద్
● సర్వజనాస్పత్రికి పరుగులు పెట్టిన రోగులు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణం మీదకు తెస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన చేసిన వైద్య చికిత్సలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని 46 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో కేన్సర్, డయాలసిస్, ఆర్థో రోగులు, గర్భిణులు, బాలింతలు, హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి క్యూ కట్టారు. నగరంలోని ప్రముఖ ఆస్పత్రులు శస్త్రచికిత్సలను నిరాకరించడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు లోనయ్యారు. కొందరు ప్రైవేట్‌గానే డబ్బులు వెచ్చించి శస్త్రచికిత్సలు చేయించు కోవాల్సి వచ్చింది.
కేవలం 10 ఫ్రీ ఆథరైజేషన్‌లు
రెగ్యులర్‌గా అనంతపురంలోని వివిధ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోజూ 150 నుంచి 200 మంది రోగులకు ఫ్రీ ఆథరైజేషన్‌లు నమోదు చేస్తారు. దాని ఆధారంగా ఎన్టీఆర్ వైద్య సేవ అనుమతితో శస్త్రచికిత్సలు చేస్తారు. కాగా ఆస్పత్రులు శస్త్రచికిత్సలకు నిరాకరించడంతో శుక్రవారం కేవలం 10 ఫ్రీ ఆథరైజేషన్‌లు మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కొన సాగితే రానున్న రోజుల్లో రోగులు మరింత ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు.
●
ఈ ఆటోలో కూర్చున్న పెద్దాయన ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన సాకే గంగన్న. నరాలు, గుండె తదితర సమస్యలతో అనంతపురం సాయినగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలు లేవని, ప్రైవేట్‌గా చూపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.
ఎమర్జెన్సీ సేవలందుతున్నాయి
జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు అందుతున్నాయి. డయాలసిస్, కేన్సర్, తదితర రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ తదితరులతో మాట్లాడాం. గుండె, నెఫ్రాలజీ, కేన్సర్ కేసులకు సత్వర వైద్యం అందించేలా చూడాలని చెప్పాం.
– డాక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి,
జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ