
సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్యాయత్నం
● భూ సమస్యను పరిష్కరించాలని..
కళ్యాణదుర్గం రూరల్: తన భూ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు అధికారులకు తెలిపినా ఫలితం దక్కడం లేదంటూ ఓ రైతు గురువారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అంతకుముందు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు వైరల్ అయింది. బాధితుడి తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన రైతు బొమ్మయ్యకు గ్రామ సమీపంలోని కొండ వద్ద పొలం ఉంది. ఇటీవల కొండలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు చేపట్టారు. ఈ క్రమంలో రాళ్లన్నీ ఎగిరి బొమ్మయ్య పొలంలో పడుతున్నాయి. కళ్యాణదుర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ గోవిందప్పకు చెందిన కంకర మిషన్‌కు టిప్పర్లతో రాళ్లను తరలిస్తున్నారు. దీంతో పొలంలోని పంట నాశనమవుతోంది. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించ లేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బొమ్మయ్య గురువారం అదే కొండపైకి ఎక్కి తన బాధనంతా సెల్ఫీ వీడియోలో వివరించి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గుర్తించిన స్థానికులు అప్రమత్తమై రైతును కాపాడారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ముదిగల్లు గ్రామస్తులు కోరారు.
పది ఇసుక ట్రాక్టర్ల సీజ్
రాయదుర్గం: వేదవతి నది నుంచి ఇసుకను రాయదుర్గంలోకి అక్రమంగా తరలిస్తున్న పది ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు అర్భన్ సీఐ జయనాయక్, రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. మండలంలోని 74 ఉడేగోళం వద్ద గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో ఇసుక ట్రాక్టర్లు పట్టుబడ్డాయన్నారు. సరైన రికార్డులు చూపకపోవడంతో తహసీల్దార్‌కు రెఫర్ చేసినట్లు వివరించారు. ఉచితం ముసుగులో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పట్టుబడితే వాహనం సీజ్‌తో పాటు బాధ్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వివాహిత బలవన్మరణం
కణేకల్లు: మండలంలోని జక్కలవడికి గ్రామానికి చెందిన వివాహిత బోయ మారెక్క (40) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త ఎర్రిస్వామి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. గర్భకోశ సమస్యతో బాధపడుతున్న మారెక్కకు 8 నెలల క్రితం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గర్భకోశాన్ని తొలగించిన అనంతరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె జీవితంపై విరక్తితో గురువారం వేకువజామున ఇంటి ఆవరణలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన కుటుంబసభ్యులు గమనించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
అదృశ్యమైన బాలిక కర్ణాటకలో ప
బొమ్మనహాళ్: మండల కేంద్రంలో కొలిమి పనులు కోసం వచ్చి ఆగస్టు నెలలో అదృశ్యమైన ఓ మైనర్ బాలిక ఆచూకీని కర్ణాటకలోని కాటిగి ప్రాంతంలో గుర్తించినట్లు బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. కర్ణాటకలోని మొలకాల్మూర్ తాలుకా రాంపురం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి కొలిమి పనుల కోసం బొమ్మనహాళ్‌కు వచ్చింది. పని ఒత్తిడి కావడంతో తన తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయింది. దాదాపు నెల రోజుల పాటు కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో గత నెల 22న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. కాటిగిలోని తన మేనమామ ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించి, అక్కడి నుంచి పిలుచుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్యాయత్నం