చౌకబారు రాజకీయాలు మానుకో.. | - | Sakshi
Sakshi News home page

చౌకబారు రాజకీయాలు మానుకో..

Sep 19 2025 1:59 AM | Updated on Sep 19 2025 1:59 AM

చౌకబా

చౌకబారు రాజకీయాలు మానుకో..

మంత్రి సవితకు ఎమ్మెల్సీ మంగమ్మ హితవు

అనంతపురం కార్పొరేషన్‌: వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబడితే మంత్రి సవిత చౌకబారు రాజకీయాలకు తెరలేపడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ మంగమ్మ మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని పేద పిల్లలకు వైద్య విద్యను అందుబాటులో తీసుకువచ్చేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెనుకొండలో వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 వైద్య కళాశాలలకు వైఎస్సార్‌సీపీ హయాంలో అనుమతులు వచ్చాయన్నారు. ఈ కళాశాలలు పూర్తయి పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య చేరువైతే వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటీకరణకు పాల్పడుతోందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ సైతం చేష్టలుడిగి చూస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఏడు పొట్టేళ్ల అపహరణ

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధిలోని బీఎన్‌ఆర్‌ కాలనీలో దొంగలు పడి ఓ ఇంటి ఆవరణలో ఉన్న ఏడు పొట్టేళ్లను ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన మేరకు.. నాగన్న, హేమావతి దంపతులు కొన్ని రోజులుగా పొట్టేళ్ల పిల్లలను తెచ్చుకుని వాటిని మేపి పెద్దవయిన తర్వాత విక్రయించగా వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 4 నెలల వయసున్న 15 పొట్టేళ్లు ఉన్నాయి. వీటి పోషణకు చుట్టూ బండలు పాతి షెడ్డు ఏర్పాటు చేశారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఓ బండను పక్కకు తప్పించి అందులో నుంచి 7 పొట్టేళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం పొట్టేళ్లు కనిపించకపోవడంతో దంపతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. గతంలోనూ నాలుగు పొట్టేళ్లను ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని గుప్పిట్లో

ఎన్నికల కమిషన్‌

డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ధ్వజం

ఉరవకొండ: ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కు ఉన్నా, ప్రధాని చేతిలో పూర్తిగా బంధీ అయి రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై. మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. దొంగ ఓట్లకు నిరసనగా ‘ఓట్‌ చోర్‌ గద్ది చోర్‌’ పేరుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం ఉరవకొండలో ఆయన లాంఛనంగా ప్రారంభించి, మాట్లాడారు. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తోందన్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు మోదీ గుప్పెట్లో ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ సాక్ష్యాలతో సహా బయటపెట్టారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు రాహుల్‌గాంధీ నాయకత్వంలో పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా మైనార్టీ చైర్మన్‌ అబ్బాస్‌ రెహ్మన్‌, నాయకులు ఆలం నవాజ్‌, బొజ్జప్ప, బ్యాళ్ల ప్రసాద్‌, నబీరసూల్‌ పాల్గొన్నారు.

చౌకబారు రాజకీయాలు మానుకో.. 1
1/1

చౌకబారు రాజకీయాలు మానుకో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement