
అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ‘ఉచితం’ అసాధ్యం
● త్వరలో ఆర్టీసీకి 1,050 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు
● ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
గుంతకల్లు టౌన్/ఉరవకొండ/గుత్తి: అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలు చేయడం అసాధ్యమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ అంతర్రాష్ట్ర సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించలేదన్నారు. గురువారం ఆయన అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి, ఉరవకొండల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో ‘సీ్త్ర శక్తి’ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లోకి ఎక్కి ఈ పథకం గురించి ప్రయాణికుల అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో 90 మంది ప్రయాణికులకు మించి ఎక్కించుకోరాదని, ఫుట్‌బోర్డుపై ఎవరినీ నిలబెట్టవద్దని కండక్టర్లను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం కింద రోజూ 25 లక్షల మంది మహిళలు ఉచితంగా రవాణా చేస్తున్నారన్నారు. ఇటీవల బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిందని, అవసరమైతేనే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి త్వరలోనే 1,050 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయన్నారు. రాష్ట్రంలో విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ కంపెనీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ధారాదత్తం చేసేది లేదన్నారు. పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్‌ను వీలైనంత త్వరగా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. బస్ డిపోల్లో టాయిలెట్స్, తాగునీరు, ఫ్యాన్లు తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గుత్తిలో అధునాతనంగా ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మిస్తామన్నారు. గుంతకల్లు నుంచి అమరావతి, హైదరాబాద్‌లకు తొలుత ఓ నెల పాటు పైలట్ ప్రాజెక్టుగా సర్వీసులను నడుపుతామని, సక్సెస్ అయితే యథావిధిగా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఆయన వెంట ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజు, ఆర్టీసీ జోన్–4 ఈడీ చంద్రశేఖర్, ఇన్‌చార్జ్ ఆర్‌ఎం శ్రీలక్ష్మి, గుంతకల్లు డీఎం గంగాధర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.