
టెట్ నుంచి మినహాయింపునివ్వాలి
● ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకుల డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ వృత్తిలో 2011కు ముందు చేరిన వారికి ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) నాయకులు కోరారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ప్రమోషన్లు తీసుకోవాలన్నా, 2010 తర్వాత ప్రమోషన్లు తీసుకున్న వారందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంగ్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంబంధిత ఉపాధ్యాయ సంఘాల ద్వారా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఆపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ వినతి పత్రాన్ని ప్రధానికి పంపాలని కోరారు. కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్, జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, ఉపాధ్యక్షులు పి.శివప్రసాద్‌నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతులయ్య పాల్గొన్నారు.