
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అమానుషం
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: రాష్ట్రంలోని 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకే ఇంతటి అమానుషమైన చర్యలకు ప్రభుత్వ పెద్దలు తెగబడ్డారని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థులకు వైద్యవిద్యను చేరువ చేసేలా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేశారన్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారన్నారు. గత విద్యా సంవత్సరానికే పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని మెడికల్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా, ప్రైవేట్‌కు అప్పగించాలన్న దురుద్దేశంతో పులివెందులకు మంజూరైన అనుమతులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోకపోతే ప్రజల పక్షాన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో
65 మందికి ఉద్యోగాలు
అనంతపురం: ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లోని విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 65 మందికి ఉద్యో గాలు దక్కాయి. ఈ మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర తెలిపారు. మొత్తం 97 మంది విద్యార్థులు హాజరుకాగా, 65 మందికి ఉద్యోగాలు దక్కాయి. ఉద్యోగాలు దక్కిన విద్యార్థులను ఈఫిల్ టెక్ సొల్యూషన్ డైరెక్టర్ కిషోర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు రాజేష్ కుమార్ గౌడ్, హెచ్‌ఓడీలు ప్ర దీప్ కుమార్, రాజేష్ కుమార్ అభినందించారు.
ఆటోను ఢీకొన్న అంబులెన్స్
●నలుగురికి గాయాలు
శింగనమల: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై లోలూరు క్రాస్ వద్ద ఆటోను ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొంది. శుక్రవారం పామిడి మండలం గంజరాంపల్లికి చెందిన హర్ష, డి.అనిల్, నరేంద్ర, అనిల్ ఆటోలో లోలూరు క్రాస్ వద్ద రసాయనిక మందులు కొనుగోలు చేయడానికి వచ్చారు. క్రాస్ వద్ద ఎడమ వైపు ఉన్న ఫర్టిలైజర్స్ వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతున్న ఆటోను గార్లదిన్నె వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్ ఢీకొంది. ఆటోలో ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అదే అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అమానుషం