
ఎరువుల సరఫరాలో ‘కూటమి’ వైఫల్యం
ఉరవకొండ: రైతులకు ఎరువులు అందించలేని దౌర్భగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్దార్థ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా యూరియా కొరత నెలకొని రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే బస్తా యూరియా ఇస్తామంటూ నిబంధన పెట్టడం దుర్మార్గమన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు విచిత్రంగా స్పందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలను అరెస్ట్ చేస్తూ అణిచివేత, నిర్భంధాలకు తెరలేపారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా ద్వారా 6.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకూ ఎన్ని ఎకరాలకు నీరిచ్చారో చెప్పే దమ్ము ప్రభుత్వానికి, మంత్రి కేశవ్‌కు లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంలో హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు కనీసం 10 టీఎంసీల నీటిని కూడా తీసుకు రాలేకపోయారన్నారు. నిరంకుశ ధోరణితో లక్షలాది మందికి పైగా రైతులను పంట బీమా పథకానికి దూరం చేశారన్నారు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని చెప్పి నేటికీ చాలా మందికి చెల్లించకుండా దగా చేశారని మండిపడ్డారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 9న గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతులను దగా చేసిన చంద్రబాబు
ఈ నెల 9న గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయండి
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి