
అమ్మవారి సొమ్ము తిరిగొచ్చింది!
బుక్కరాయసముద్రం: అమ్మవారి సొమ్ము తిరిగొచ్చింది.ఆలయ హుండీలో డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు నెలన్నర తరువాత అదే ఆలయంలో వదిలి వెళ్లారు. అక్కడ ఒక లేఖ కూడా ఉంచారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ తల్లి దేవాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... ముసలమ్మ ఆలయంలోకి ఈ ఏడాది జూలై 22న గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి హుండీని పగలకొట్టారు. అందులోని నగదుతో పాటు ఆలయంలోని సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. శుక్రవారం ఉదయం పూజారి ఆలయం తలుపులు తీసి పూజలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా కరెన్సీ నోట్లు కన్పించాయి. వెంటనే ఆలయ ధర్మకర్తకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించగా.. డబ్బుతో పాటు లెటరు కూడా కన్పించింది. డబ్బు లెక్కించగా రూ.1.86 లక్షలు ఉంది. ఇక లేఖలో.. ‘మేము నలుగురు కలసి అమ్మవారి డబ్బులు ఎత్తుకెళ్లాము. తరువాత మా కుటుంబాల్లో పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. అమ్మవారి సొమ్ములో కొంత తీసుకుని మా పిల్లలను బాగు చేయించుకుంటున్నాము. అమ్మా.. మమ్మల్ని క్షమించాల’ని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆలయ ధర్మకర్త సుశీలమ్మ స్పందిస్తూ.. అమ్మవారు చాలా శక్తివంతమైనవారని, అమ్మవారి సొమ్ము తీసుకుని ఎవరూ జీర్ణించుకోలేరని అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. నూతనంగా అమర్చిన సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
ముసలమ్మ తల్లి, అమ్మవారి ఆలయంలో డబ్బులు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

అమ్మవారి సొమ్ము తిరిగొచ్చింది!