రాయదుర్గం: ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ అనంతపురం నుంచి మొలకాల్మూరు వరకూ ఎన్‌హెచ్–54 జాతీయ రహదారి నిర్మాణ పనులు రాయదుర్గం వద్ద అర్ధంతరంగా ఆగిపోయాయి. కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం మీదుగా మొలకాల్మూరు వరకు రూ.194 కోట్ల ప్యాకేజీతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాయదుర్గం పట్టణంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా 74 ఉడేగోళం వైఎస్సార్ సర్కిల్ నుంచి బీటీపీ ప్రధాన రహదారి దాటుకుని శ్మశాన వాటిక వరకు రోడ్డు ఓవర్ (ఆర్‌ఓబీ) బ్రిడ్జి నిర్మించారు. కోతిగుట్ట సమీపంలో రైల్వే లైనుపై బోస్టరింగ్ గడ్డర్ నిర్మాణానికి రైల్వే అధికారులు అనుమతులు జారీ చేయకపోవడంతో ఈ పనులు కాస్త ఆగిపోయాయి. దీంతో అప్పటి జగన్ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే అధికారుల్ని ఒప్పించి నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేలా కృషి చేసింది. ఈ లోపు ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఈ పనులు పూర్తి చేయలేక వదిలేసింది. దీంతో పట్టణంలోకి వచ్చే భారీ వాహనాల సంఖ్య ఎక్కువైంది. 12, 16, 18 చక్రాల లారీలు ఇరుకై న వినాయక సర్కిల్‌లో తిప్పుకోలేక డ్రైవర్లు నానా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. అంతేకాక భారీ వాహనాల రాకతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బైపాస్ పూర్తయితే భారీ వాహనాలన్నీ అటుగా వెళ్లగలిగితే సగం ట్రాఫిక్ తగ్గుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. చిన్న పని పూర్తి చేసేలా అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
హైవే పనులన్నీ పూర్తయ్యాయి. కోతిగుట్ట సమీపంలో రైల్వే లైనుపై బోస్టరింగ్ గడ్డర్ నిర్మాణం మాత్రమే పెండింగ్‌లో ఉంది. దీంతో బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికే లక్నో, హుబ్లీ, చైన్నె ప్రాంతాల నుంచి రైల్వే అధికారుల బృందాలు వచ్చి పరిశీలించి వెళ్లాయి. ఇటీవల ఫైనల్ కమిటీ సభ్యులు కూడా చూసి వెళ్లారు. త్వరలో పనులు ప్రారంభించి పెండింగ్ పనులు పూర్తి చేస్తాం.
– కుల్లాయ్‌రెడ్డి, ఎన్‌హెచ్ ఏఈ, అనంతపురం
రూ.194 కోట్లతో ఎన్‌హెచ్–54 నిర్మాణం
రైల్వే బోస్ట్ రింగ్ గడ్డర్ నిర్మాణ పనుల్లో జాప్యం
ఎటూ తేల్చక వదిలేసిన అధికారులు
పట్టణంలోకి భారీ వాహనాలు.. తరచూ ప్రమాదాలు