
‘కమాటి’ మాయాజాలం
ఉరవకొండ: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో రెగ్యులర్ కమాటిగా పనిచేస్తున్న రమణమ్మ మూడేళ్లుగా విధులకు డుమ్మా కొడుతున్నా.. అధికారులు మాత్రం ప్రతి నెలా జీతం చెల్లిస్తున్నారు. రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం తీసుకుంటూ విధులకు గైర్హాజరవుతున్న ఆమె తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టమైన సమాచారం గిరిజన శాఖ ఉన్నతాధికారులకు ఉన్నా.. మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, కమాటికి ప్రిన్సిపాల్ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రిన్సిపాల్ అండ చూసుకుని మూడేళ్లుగా బినామీని ఏర్పాటు చేసి 225 మంది విద్యార్థినులకు వంట చేయిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు ప్రతి నెలా రూ.6వేలు కూలి చెల్లిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రిన్సిపాల్ మాత్రం రోజూ కమాటి రమణమ్మ విధులకు హాజరవుతున్నట్లు రికార్డులు సృష్టించి ప్రతి నెలా జీతాలు మంజూరయ్యేలా చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంలో ప్రిన్సిపాల్‌కూ అంతోఇంతో కమాటి రమణమ్మ ముట్టజెపుతున్నట్లు ఆరోపణలున్నాయి.
అనారోగ్యంతో రావడం లేదు
గురుకులంలో రెగ్యులర్ కమాటి మూడేళ్లుగా అనారోగ్యంతో విధులకు హాజరుకావడం లేదు. దీంతో తానే బినామీని ఏర్పాటు చేసి వంట చేయిస్తోంది. కమాటికి హాజరు వేయడం ద్వారా ప్రతి నెలా జీతాలు అందిస్తున్నాం. లేకపోతే విద్యార్థులకు వంట చేసి పెట్టే వారు రారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అటెండెన్స్ వేయాల్సి వస్తోంది.
– అరుణ, ప్రిన్సిపాల్, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఉరవకొండ
గిరిజన బాలికల గురుకులంలో మూడేళ్లుగా విధులకు డుమ్మా
అయినా ఠంచన్‌గా జీతం అందజేస్తున్న అధికారులు