
తాగుడుకు డబ్బివ్వలేదని ఆత్మహత్య
రాప్తాడు: తాగుడుకు డబ్బు ఇవ్వలేదంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం యర్రగుంటకు చెందిన ఉప్పర గౌతమికి రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి కోడిగ సంజీవయ్య (31)తో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంటలోనే కాపురం ఉంటున్నారు. అదే గ్రామంలో ఐసీఆర్పీ సంస్థలో గౌతమి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మద్యానికి బానిసైన సంజీవయ్య ఎలాంటి పనిపాటా చేయకుండా జులాయిగా మారాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని మద్యం మత్తులో తరచూ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. తాగేందుకు డబ్బు ఇవ్వాలని కొట్టేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి నచ్చచెప్పినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 4న తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో గడ్డి మందు తాగి బాత్రూమ్‌లో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక గురువారం రాత్రి సంజీవయ్య మృతి చెందాడు. గౌతమి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.