సర్వ‘జన’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సర్వ‘జన’ కష్టాలు

Sep 2 2025 7:20 AM | Updated on Sep 2 2025 7:20 AM

సర్వ‘

సర్వ‘జన’ కష్టాలు

అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వసతులు రోజురోజుకూ దారుణంగా పడిపోతున్నాయి. పేద రోగులకు చుక్కలు కనపడుతున్నాయి. ఇటీవల జిల్లాపై విష జ్వరాలు పంజా విసిరాయి. దీంతో సర్వజనాస్పత్రికి జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. ఇక్కడేమో ఓపీ చీటీ తీసుకునేందుకే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ‘అభా’ రిజిస్ట్రేషన్‌ పేరుతో వైద్య సిబ్బంది చుక్కలు చూపుతున్నారు. ఈ క్రమంలో మహిళలు చంటిబిడ్డలను ఎత్తుకుని క్యూలో నిల్చోలేక నరకం అనుభవిస్తున్నారు.

నిద్రమత్తులో పర్యవేక్షణాధికారి..

వాస్తవంగా ‘అభా’ రిజిస్ట్రేషన్‌ ఒకసారి చేయిస్తే చాలు. ఇందుకోసం వార్డుల వారీగా ప్రత్యేకంగా ఓపీలు ఏర్పాటు చేసి కంప్యూటర్లు సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో అదే సమస్యపై మళ్లీ రోగి వచ్చినప్పుడు నేరుగా ప్రత్యేక ఓపీకి వెళ్తే సరిపోతుంది. కానీ, ఉమ్మడి జిల్లాకే పెద్ద దిక్కైన సర్వజనాస్పత్రిలో ఆ సౌకర్యం లేకుండా పోయింది. ‘అభా’ కింద ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయని చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియని దుస్థితి నెలకొంది. ‘అభా’ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డాక్టర్‌ సౌజన్య కుమార్‌ నిద్రమత్తులో ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పేద రోగులకు అవస్థలు తప్పడం లేదు.

ఎంఎన్‌ఓల నిర్లక్ష్యం

సర్వజనాస్పత్రిలో రోగులకందే సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో ఎంఎన్‌ఓ (మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ)లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యులు, ఇతర సిబ్బందితోనూ ఒక్కోసారి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం సర్జికల్‌ వార్డులో అడ్మిషన్‌లో ఉన్న రామగిరి మండలం పోలేపల్లికి చెందిన కిష్టప్పకు వైద్యులు సిటీ స్కాన్‌కు రెఫర్‌ చేయగా... ఎంఎన్‌ఓ పత్తా లేక పోవడంతో రోగి కుటుంబీకులే అతికష్టం మీద మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్జరీ విభాగం నుంచి సిటీ స్కాన్‌ గదికి వీల్‌చైర్‌పై తీసుకెళ్లారు.

చిన్నారులతో చెలగాటం

సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో చిన్నారుల పట్ల వైద్యులు, కొందరు స్టాఫ్‌నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డులో ఆయాసం ఉన్న పిల్లలకు సిబ్బంది పర్యవేక్షణలో నెబులైజేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లులే నెబ్యులైజర్‌ ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి పట్టడం గమనార్హం.

ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఓంకారమ్మ. కుందుర్పి గ్రామానికి చెందిన ఈమెకు ఇటీవల జ్వరం వచ్చింది. ఓంకారమ్మ 11 నెలల కుమారుడు అభినయ్‌ కూడా జ్వరం బారిన పడ్డాడు. వారం రోజుల క్రితం ఇద్దరూ కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో చూపించుకున్నా జ్వరం తగ్గలేదు. దీంతో సోమవారం మెరుగైన వైద్యం కోసం ఇద్దరూ అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చారు.ఇక్కడ చూస్తే ఓపీ చీటీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో క్యూలో నిల్చునే ఓపిక లేక ఇలా తల్లీకుమారుడు కూర్చుండిపోయారు. ఓంకారమ్మ మాత్రమే కాదు.. నిత్యం సర్వజనాస్పత్రిలో ఎంతో మంది ఇలాగే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.

జీజీహెచ్‌లో దయనీయ పరిస్థితులు

ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ

చిన్నపిల్లల వార్డులో అవస్థలు

రోగులకు తప్పని ఇబ్బందులు

సర్వ‘జన’ కష్టాలు 1
1/2

సర్వ‘జన’ కష్టాలు

సర్వ‘జన’ కష్టాలు 2
2/2

సర్వ‘జన’ కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement