
కనికరించండి సారూ
అనంతపురం అర్బన్: కనికరించి.. కరుణ చూపండి అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. పదేళ్ల తమ కుమారుడు సోమశేఖర్ బుద్ధిమాంద్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడని, పింఛను రూ.15 వేలు వచ్చేలా చూడాలని కలెక్టర్ వినోద్ కుమార్‌కు అనంతపురం నాల్గో రోడ్డులో నివాసముంటున్న లావణ్య, శ్రీనివాసులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 380 వినతులు అందాయి.
● తమ భూమి తమకు ఇప్పించాలని అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన కుళ్లాయిస్వామి కోరాడు. తన తండ్రి హరిజన నారాయణ కు సర్వే నంబరు 334–17లో ఎకరా భూమికి 1976లో ప్రభుత్వం డి.పట్టా మంజూరు చేసింద న్నాడు. 2018లో తండ్రి చనిపోగా.. భూమిని వేరేవాళ్లు ఆక్రమించారన్నాడు. అధికారులు ఆక్రమణ దారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, సమస్య పరిష్కరించకుంటే తమకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.