
హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి
పుట్లూరు: హామీలు అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ శైలజా నాథ్, కేతారెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పుట్లూరు మండల కేంద్రంలో పార్టీ మండల కన్వీనర్ పొన్నపాటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు అండ్ కో ఇష్టారాజ్యంగా హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక నేడు అన్ని వర్గాలనూ దారుణంగా మోసగిస్తోందన్నారు. ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ పథకాలు అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకోవడం సీఎం చంద్రబాబు కపటత్వానికి నిదర్శనమన్నారు. ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా ప్రతి నెలా రూ.1,500 అందిస్తామని నేడు మరిచిపోయారన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో పరిశీలిస్తే చాలా పథకాలు ప్రజలకు అందలేదన్నారు. టీడీపీ నాయకులు ఇళ్ల దగ్గరకు వస్తే ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తాన్ని ఇవ్వాలని నిలదీయాలన్నారు. ప్రతి ఇంటికీ కనీసం రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు బకాయి ఉన్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, బీసీ నారాయణరెడ్డి, వంశీ గోకుల్‌రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ, శింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణీంద్ర, మండల కన్వీనర్లు యల్లారెడ్డి, పూల ప్రసాద్, నార్పల ఖాదర్‌వలీఖాన్, నాయకులు సర్పంచ్ రామక్రిష్ణారెడ్డి, లాయర్ భాస్కర్‌రెడ్డి, మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, కంచెం శ్రీనివాసులరెడ్డి, శివారెడ్డి, నారాయణస్వామి, మాజీ సర్పంచ్ రామాంజులరెడ్డి, రామమోహన్‌రెడ్డి, శ్యామ్ సుంద ర్‌రెడ్డి, కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, దోశలేడు నరసింహారెడ్డి, రమణారెడ్డి, మద్దిలేటి, వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్, సూరి, రామమోహన్, రసూల్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు
ప్రతి కుటుంబానికీ ఈ ప్రభుత్వం
రూ. 2 లక్షల వరకూ బాకీ:
సమన్వయకర్తలు శైలజానాథ్, పెద్దారెడ్డి