24 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

24 మండలాల్లో వర్షం

Sep 2 2025 7:10 AM | Updated on Sep 2 2025 7:20 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో 24 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విడపనకల్లు మండలంలో 22 మి.మీ, వజ్రకరూరు 21, గార్లదిన్నె 20.8, ఆత్మకూరు 18.2, కణేకల్లు 12, పామిడి 11.4, పెద్దవడుగూరు 11.2, ఉరవకొండ 10.2 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్‌లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 210 మి.మీ గానూ 19 శాతం అధికంగా 254 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా 20 వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదయ్యాయి. 19 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా, 9 మండలాల్లో సాధారణం, మిగతా 3 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి.

‘మారథాన్‌’లో

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు తప్పనిసరిగా ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌’లో మంగళవారంలోపు రిజిస్టర్‌ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు, జిల్లా సైన్స్‌ అధికారి బాలమురళీకృష్ణ సూచించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, సైన్స్‌ పరిశోధన సంస్థ సంయుక్తంగా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల జిజ్ఞాసను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆలోచన, విశ్లేషణ, అన్వేషణ సామర్థ్యాలను అభివృద్ధి పరిచి వారినుంచి నూతన ఆవిష్కరణలు తయారు చేసేలా ప్రోత్సహించాలన్నారు. సైన్స్‌ పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకునేందుకు, పెంపొందించుకునేందుకు స్కూల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌ చక్కని అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రతి స్కూల్‌లోనూ కనీసం 50 మంది విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారితో ఆవిష్కరణలు చేయించాలని సూచించారు. ఆ విద్యార్థులకు స్కూల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌ సభ్యులు సహకరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి బాలమురళీకృష్ణను సంప్రదించాలని సూచించారు.

రాగులపాడు గురుకులంలో అక్రమాలపై విచారణ

ఉరవకొండ: రాగులపాడు గురుకుల పాఠశాలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేస్తామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. వజ్రకరూరు మండలంలోని రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థుల హాజరులో చోటు చేసుకుంటున్న అక్రమాలకు సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయనపై స్పందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ అక్రమాలపై రెండు రోజుల్లో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. గత 5 రోజుల నుంచి నమోదు చేసిన విద్యార్థుల హాజరును పరిశీలిస్తామన్నారు. తప్పు చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే రెగ్యులర్‌ ఉద్యోగికి పాఠశాల ప్రిన్సిపాల్‌ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.

అందుబాటులో యూరియా

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ 16,025 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు డీలర్ల వద్ద 822 మెట్రిక్‌ టన్నులు, సొసైటీల వద్ద 77 మెట్రిక్‌ టన్నులు, 326 రైతు సేవా కేంద్రాల వద్ద 109 మెట్రిక్‌ టన్నులు, మార్క్‌ఫెడ్‌, హోల్‌సేలర్‌ల వద్ద 1,027 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రవాణా (ట్రాన్సిట్‌) 649 మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు. ఆగస్టు 30న జిల్లాకు ఆర్‌సీఎఫ్‌ కంపెనీకి చెందిన 388 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఈ వారంలో స్పిక్‌ కంపెనీకి చెందిన 904 మెట్రిక్‌ టన్నులు, ఐపీఎస్‌ కంపెనీకి చెందిన 800 మెట్రిక్‌ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు.

24 మండలాల్లో వర్షం 1
1/2

24 మండలాల్లో వర్షం

24 మండలాల్లో వర్షం 2
2/2

24 మండలాల్లో వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement