
టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
● వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ప్రహరీ ధ్వంసం
● అడ్డొచ్చిన వారిపై దాడి
రాప్తాడు: కూటమి ప్రభుత్వం వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. సోమవారం రాప్తాడు మండలం భోగినేపల్లిలో ఓ మహిళ, మరో వ్యక్తిపై టీడీపీ శ్రేణులు కిరాతకంగా దాడికి పాల్పడ్డాయి. వివరాలు.. భోగినేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అవిలిగొండ శివయ్య తన ఇంటి కుడి పైపు మూడు అడుగుల స్థలం వదిలి నూతన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. పక్కనే టీడీపీ కార్యకర్త వలగోండ కదిరప్పకు చెందిన పాడుబడిన ఇంటితో పాటు మరొక ఇల్లు ఉంది. శివయ్య ఇంటిపక్కనే ఉన్న మూడు అడుగుల స్థలం కూడా తనదేనంటూ కదిరప్ప కబ్జా చేసేందుకు పూనుకున్నాడు. సోమవారం ఉదయం శివయ్య స్థలానికి సంబంధించిన పాత గోడను కూల్చివేసేందుకు సిద్ధపడ్డాడు. శివయ్య, ఆయన భార్య జానకమ్మ అడ్డు చెప్పగా.. ‘ఈ స్థలం నాది. ఇప్పుడున్నది మా ప్రభుత్వం. అడ్డొస్తే ఇక్కడే పాతి పెడతా’ అంటూ దాడికి దిగాడు. దీనిపై శివయ్య కుమార్తె శోభా, అన్న అవిలిగొండ ఆదెప్ప నిలదీయగా.. వారిపైనా దాడి చేశాడు. కదిరప్పతో పాటు భార్య శివమ్మ, కుమారుడు సాయికుమార్, టీడీపీ నాయకులు ధనారెడ్డి, గోపాలప్ప ఇనుపరాడ్లు, గడ్డర్లు తీసుకుని వచ్చి దాడి చేశారు. దాడిలో అవిలిగొండ శోభా చేయి విరిగింది. ఆదెప్ప తల పగిలింది. శివయ్య, జానకమ్మకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు అడ్డుకోకుంటే టీడీపీ నాయకులు చంపేసేవారని స్థానికులు చెప్పారు.

టీడీపీ వర్గీయుల దౌర్జన్యం

టీడీపీ వర్గీయుల దౌర్జన్యం