
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబును నిలదీద్దామంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌సీపీ మహిళా జోనల్ సదస్సు పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత వరుదు కళ్యాణి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏడాదిన్నర గడిచినా ఒక్కటీ అమలు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఏడాదిన్నర కాలంలోనే ప్రజల నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారన్నారు. రాష్ట్రంలో 24 శాతం మద్యం అమ్మకాలు పెరగడంతోనే మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయన్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. జగనన్న కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. జగనన్న హయంలో మహిళలు బంగారం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వంలో బంగారాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. సమావేశంలో సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.
సంపద సృష్టి పేరుతో ప్రజల నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పుల భారం
ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలు వివరించాలని పిలుపు
వైఎస్సార్‌సీపీ మహిళా జోనల్ సదస్సులో రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి