
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీచర్ ఉద్యోగం కోల్పోయా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ) నిర్లక్ష్యం వల్ల తాను టీచర్ పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయానని డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో జిల్లాలో 14వ ర్యాంకు సాధించిన దాసరి మహేష్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం విద్యాశాఖ అధికారులను కలిసి తన సమస్యను వివరించారు. ‘ఇటీవల ప్రకటించిన డీఎస్సీ–25 ఫలితాల్లో ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో నేను 84 మార్కులతో 14వ ర్యాంకు సాధించాను. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగా, బీపీఈడీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ మే 15వ తేదీలోపు లేనందున టీచర్ పోస్టుకు అనర్హుడిగా ప్రకటించారు. జీఓ–17లో అర్హత అనేది సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చూపించాలనేది స్పష్టంగా ఉంది. నేను కూడా పరిశీలన సమయానికి సర్టిఫికెట్లను చూపించినా అధికారులు ఒప్పుకోలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి, ఏప్రిల్ మొదటి వారంలోనే ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాయి. కానీ ఎస్కేయూ మాత్రం నిర్వహించలేదు. చివరి సెమిస్టర్ పరీక్షలను దాదాపు ఐదు నెలలు ఆలస్యంగా నిర్వహించింది. డీఎస్సీ–25కి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు అర్హత సాధించినా, ఎస్కేయూలో చదివి మంచి మార్కులు సాధించిన నాకు మాత్రం అన్యాయం జరిగింది. ప్రభుత్వం, విద్యాశాఖ, ఎస్కేయూ నిర్లక్ష్యం వల్ల నేను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. సకాలంలో పరీక్షలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్‌పై ఉంది. విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించి నాకు న్యాయం చేయాలి’ అని దాసరి మహేష్‌కుమార్ కోరారు.
14వ ర్యాంకర్ ఆవేదన