రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలే | - | Sakshi
Sakshi News home page

రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలే

Aug 1 2025 11:29 AM | Updated on Aug 1 2025 11:29 AM

రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలే

రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలే

అనంతపురం కార్పొరేషన్‌: ‘ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతాంగం కరువు కోరల్లో చిక్కుకున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. కరువు పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు ప్రణాళిక రూపొందించలేదు. రైతాంగం పట్ల ఇంత నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వాన్ని నా ప్రజా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20,000 ఇంత వరకు ఇవ్వలేదు. రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలు తప్పవు’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేంద్రంతో కలిపి ఇస్తామని చెబుతుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే తొలి ఏడాది రైతులను ఎగనామం పెట్టారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 53.58 లక్షల మంది రైతులకు ఏటా రైతు భరోసా పథకం కింద రూ.13,500 అందజేశారన్నారు. ఉమ్మడి అనంత పురం జిల్లాలో 5.74 లక్షల మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. రైతులు నేడు ఈ–కేవైసీ, ఎన్‌పీసీఐ లింక్‌ కోసం కష్టాలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. ‘తల్లికి వందనం’ తరహాలో ‘అన్నదాత సుఖీభవ’లో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించేదని, కూటమి ప్రభుత్వంలో రైతులే ప్రీమియం చెల్లించాలని బాబు నిబంధన పెట్టారని దుయ్యబట్టారు. బీమా ప్రీమియం గడువు ముగిసినా నేటికీ చాలా మంది రైతులు కట్టలేదన్నారు. గత ఏడాది ఖరీఫ్‌, రబీలో ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని, ఈ ఏడాదీ అదే పరిస్థితిని కొనసాగించి రైతులను నిలువునా ముంచుతారా? అని ప్రశ్నించారు.

సమీక్ష నిర్వహించాలి..

రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘అనంత’ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలుగా ఉందని, కానీ ఈ ఏడాది కార్తెలు దాటిపోయినా ఇప్పటి వరకు కేవలం 3.94 లక్షల ఎకరాల్లోనే వివిధ పంటల సాగు చేశారన్నారు. వేరుశనగ 8 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసేవారుంటే ప్రస్తుతం 1.63 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నా ప్రణాళిక లేకపోవడంతో నీరు సముద్రం పాలవుతోందని వాపోయారు. ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించలేదన్నారు.

బ్లాక్‌లో ఎరువులు..

హెచ్‌ఎల్‌సీ కింద అక్కడక్కడా నాట్లు వేద్దామనుకుంటే ఎరువుల కొరత వేధిస్తోందన్నారు. జిల్లాలో రైతాంగం బ్లాక్‌లో ఎరువులు కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్యపు స్థితికి అధికారులు తీసుకువచ్చారని మండిపడ్డారు. అక్కరకు రాని ఫర్టిలైజర్స్‌ కొనుగోలు చేస్తేనే ఎరువులు ఇస్తామంటూ చెబుతున్నారని, దీని వెనుక అధికారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవాలని కోరితే తమపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయిందన్నారు. ఏది ఏమైనా రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతులు, రాజకీయ పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు హామీ మేరకు

రైతులను ఆదుకోవాల్సిందే

గత ప్రభుత్వంలో 53.58 లక్షల మందికి ‘భరోసా’ ఇచ్చాం

అన్నదాతలను ఆదుకునే దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచించాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement