
రైతు సభ్యత్వమంటూ ఘరానా మోసం
పామిడి: రైతు సభ్యత్వ కార్డు ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.లక్షల్లో బ్యాంక్ రుణాలు ఇస్తుందంటూ ఓ జంట మోసానికి తెరలేపిన ఘటన పామిడి మండలంలో వెలుగు చూసింది. వివరాలు.. నాలుగు రోజులుగా ఇద్దరు వ్యక్తులు (వీరిలో ఒకరు మహిళ) ద్విచక్ర వాహనంపై పామిడి మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ రైతు సభ్యత్వ కార్డులంటూ పలువురి నుంచి డబ్బు వసూళ్లకు తెరలేపారు. శుక్రవారం ఉదయం పి.కొత్తపల్లికి చేరుకుని రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రధాని స్కీమ్ అంటూ నమ్మబలికారు. దీంతో దాదాపు 500 మంది రైతులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున చెల్లించి సభ్యత్వ కార్డులు పొందారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ రైతు అనుమానం వచ్చి వారిని నిలదీయడంతో ద్విచక్ర వాహనంపై ఉడాయించారు.