
కౌన్సెలింగ్‌లో పారదర్శకత ఏదీ..?
అనంతపురం మెడికల్: సచివాలయ ఏఎన్ ఎంల రీ కౌన్సెలింగ్‌లో పారదర్శకత లోపించిందని, నగరపాలక సంస్థ పరిధిలోని 74 సచివాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో సీనియారిటీ జాబితాను చూపించలేదంటూ సచివాలయ ఏఎన్‌ఎంలు మండిపడ్డారు. ఆదివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో చేపట్టిన ఏఎన్‌ఎంల రీ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి లోపలి నుంచి తాళం వేయడంతో ఏఎన్‌ఎంలు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఏఎన్‌ఎంల రీ కౌన్సెలింగ్ జరపరాదంటూ నినాదాలు చేశారు. అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
కలెక్టర్ పరిశీలన..
సచివాలయ ఏఎన్‌ఎంల రీ కౌన్సెలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డిని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. సీనియారిటీ ప్రాతిపదికన రీ కౌన్సెలింగ్ చేపట్టాలని, ఏమైనా తేడాలొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆదివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో రీ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయన కాసేపు పరిశీలించారు.