● ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు
గార్లదిన్నె: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ హుస్సేన్ (45) శనివారం రాత్రి ఆటోలో అనంతపురం మార్కెట్ మార్డుకు చేరుకుని మొక్క జొన్న కంకలు లోడు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం వేకువజామున గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సరిహద్దున పెన్నానది బ్రిడ్జి వద్దకు చేరుకోగానే టైర్ పంఛర్ అయింది. దీంతో రోడ్డు పక్కన ఆటోను నిలిపి టైర్ మారుస్తుండగా ఆటోలో ఉన్న ఖాజామొద్దీన్ సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో వాహనాలను మళ్లీస్తున్నాడు. పని పూర్తి కాగానే జాకీ కిందకు దింపే సమయంలో బెంగళూరు నుంచి మంత్రాలయానికి వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు శరవేగంగా దూసుకువచ్చింది. త్రుటిలో ప్రమాదం నుంచి ఖాజామొద్దీన్ తప్పించుకున్నాడు. బస్సు నేరుగా వెళ్లి ఆటోను వెనుక నుంచి ఢీకొంది. ఆటో డ్రైవర్ మహమ్మద్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో వెనుక కూర్చొని ఉన్న మరియమ్మ, ఉమాదేవి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అయిన శబ్ధానికి స్థానికులు నిద్ర మేల్కొని అక్కడకు చేరుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి 108 అంబులెన్స్ ద్వారా క్షతతాత్రులను అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. కాగా, మృతుడు మహమ్మద్ హుస్సేన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపారు.