
కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్: కంప్యూటర్ కోర్సులపై నిరుద్యోగ యువతకు ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఆ ఫౌండేషన్ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10 పాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఫెయిల్ లేదా పాస్ అయి... 18 నుంచి 28 సంవత్సరాల వయసున్న వారు అర్హులు. బెంగళూరులో 35 రోజుల పాటు ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణను అందిస్తారు. కంప్యూటర్, ట్యాలీ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లిషు, కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ ఎథిక్స్ లాంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. మరిన్ని వివరాలకు 90004 87423లో సంప్రదించవచ్చు.
దళితులపై దాడి
శెట్టూరు: మండలంలోని మాకోడికి గ్రామంలో దళితులపై అదే గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధితులు తెలిపిన మేరకు.. శనివారం రాత్రి గ్రామంలో పీర్ల పెద్ద సరిగెత్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దళితులు గంగాధర, మల్లెల గంగాధర, మహేష్, రామాంజనేయులు పానకాల కుండలతో పీర్ల స్వాముల ఆలయంలోకి వెళ్లారు. ఇది గమనించిన తలారి వన్నూరుస్వామితో పాటు మరికొందరు ఆలయం బయటకు తోసి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐలు యువరాజు, వంశీకృష్ణ గ్రామంలో పర్యటించి శాంతి భద్రతలు పర్యవేక్షించారు. కాగా, ఘటనపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితులను ఎమ్మార్పీఎస్ నాయకులు టైలర్ వన్నూరుస్వామి, చెలిమప్ప తదితరులు ఆదివారం పరామర్శించారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమెదు చేయాలని డిమాండ్ చేశారు.
వర్షం కోసం
కప్పలకు పూజలు
గుత్తి రూరల్: వర్షాలు కురవాలని కోరుతూ గుత్తి మండలం టి.కొత్తపల్లిలో ఆదివారం కప్పలకు పూజలు చేశారు. కప్పలను జోలెలో వేసుకొని చిన్నారులతో కలసి గ్రామస్తులు ఇంటింటికీ తిరిగి పూజలు చేయించారు. నెల రోజలుగా వర్షాలు మొహం చాటేయడంతో విత్తు కోవడానికి అదను దాటి పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా వేసిన పంటలు సైతం చినుకు జాడలేక ఎండిపోతున్నాయి. దీంతో వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ కప్పలకు పూజలు చేశారు.