
అమ్మా సారీ.. మీరు జాగ్రత్త!
● ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి.. యువకుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: ‘అమ్మా వెరీ సారీ. ఇక మీ కొడుకు లేడు. మీరు జాగ్రత్త’ అంటూ ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టి అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. బొమ్మలాటపల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నార్పల మండలం పులసలనూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ, మునేశ్వరి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవారు. వీరికి మానస, మల్లికార్జున (23) సంతానం. కుమార్తె మానసకు ఇటీవల పెళ్లి చేశారు. మల్లికార్జున అనంతపురంలో ఓ డ్రైవింగ్ స్కూల్‌లో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి వద్దకు చేరుకుని అక్కడ తల్లికి ఫేస్‌బుక్‌లో ‘అమ్మా వెరీ సారీ. ఇక నీ కొడుకు లేడు. మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వస్తాను. బాయ్. లవ్‌యూ మా. మానస కడుపులో పుడతాను. నా కోసం మీరు ఉండాలి. నాన్నకి చెప్పు..ఐ మిస్ యూ. మా లవ్‌యూ మా’ అంటూ మెసేజ్ చేసి.. అనంతరం చెట్టుకు ఉరేసుకున్నాడు. మల్లికార్జున ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది పోలీసుల విచారణలో తేలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు భారీ వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు శనివారం భారీ వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. తర్వాత నాలుగు రోజులు కూడా వర్ష సూచన ఉందని తెలిపారు. 20న 14 మి.మీ, 21న 10 మి.మీ, 22న 15 మి.మీ, 23న 12 మి.మీ. వర్షం కురిసే సూచన ఉన్నట్లు వెల్లడించారు.
సునీతమ్మా..
నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, పుట్టపర్తి: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నోరు అదుపులో పెట్టుకోవాలని.. దద్దమ్మలు ఎవరో ప్రజలందరికీ తెలుసని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు బహిష్కరించారన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎంపీపీ ఎన్నికకు వస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నా..పోలీసులు చేష్టలుడిగి చూశారన్నారు. గతంలో (2017) కనగానపల్లిలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ.. పరిటాల సునీత మంత్రి హోదాలో సమావేశానికి హాజరై వైఎస్సార్‌సీపీ సభ్యులతో బలవంతంగా చేతులు ఎత్తించి సరిపూటి గీతను ఎంపీపీ చేశారని గుర్తు చేశారు. అధికార దాహంతో దౌర్జన్యాలకు పాల్పడుతూ.. బెదిరింపులకు దిగుతూ ఎన్నికలకు తహతహలాడుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు.