
మజ్దూర్ యూనియన్ క్లీన్ స్వీప్
గుంతకల్లు: రైల్వే ఇన్‌స్టిట్యూట్ పాలకవర్గం ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ క్లీన్ స్వీప్ చేసి జయకేతనం ఎగరవేసింది. ఎన్నికల్లో ఎంప్లాయీస్ సంఘ్, మజ్దూర్ యూనియన్ అభ్యర్థులు పోటీ చేశారు. గుంతకల్లు రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 944 మందిలో 865 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 7.45 గంటల వరకు సాగింది. మజ్దూర్ యూనియన్ తరపున కార్యదర్శి స్థానానికి పోటీ చేసిన ఎల్లప్పకు 457 ఓట్లు రాగా, ఎంప్లాయీస్ సంఘ్ కార్యదర్శి అభ్యర్థి మల్లికార్జునకు 401 వచ్చాయి. దీంతో 56 ఓట్ల మెజార్టీతో కె.ఎల్లప్ప గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 7 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా ఎస్.నతానియేల్ ఎన్నికయ్యారు. వీరితోపాటు డైరెక్టర్లుగా పీఎల్ ఆంజినేయులు, కె.ధన్‌రాజ్, జి.చంద్రమౌళి, వై.శ్రీనివాసులు, ఎం.షఫీవుల్లా, కె.నెట్టికల్లు గెలుపొందారు. అనంతరం మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. టపాసులు పేలుస్తూ డప్పులు వాయిస్తూ రైల్వే ఇన్‌స్టిట్యూట్ నుంచి యూనియన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.