చెలరేగుతున్న వడ్డీ మాఫియా | - | Sakshi
Sakshi News home page

చెలరేగుతున్న వడ్డీ మాఫియా

Jul 19 2025 3:44 AM | Updated on Jul 19 2025 3:44 AM

చెలరేగుతున్న వడ్డీ మాఫియా

చెలరేగుతున్న వడ్డీ మాఫియా

అనంతపురం: అవసరాలకు అప్పు చేయడం సహజం. అయితే ధర్మ వడ్డీకి అప్పులు చేస్తే పెద్దగా ఒత్తిడి ఉండదు. కానీ ఎక్కడా డబ్బు పుట్టలేదని, సర్దుబాటు కాలేదని అదనపు వడ్డీలకు అప్పులు ఇచ్చే వ్యాపారులను ఆశ్రయిస్తే ప్రాణాలకు ముప్పు పొంచినట్టే. డబ్బు వసూలులో వడ్డీ వ్యాపారులు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన రేపుతోంది. జిల్లా కేంద్రం అనంతపురంలో కొందరు వ్యాపారులు ‘మాఫియా’గా అవతారం ఎత్తారు. వాట్సాప్‌ గ్రూపు సృష్టించుకుని.. వడ్డీ ఇవ్వని వారి వివరాలు అందులో పేర్కొంటారు. వెంటనే అందరూ అక్కడికి చేరుకుని ‘వడ్డీ ఎందుకు ఇవ్వవు’ అంటూ భౌతికదాడికి తెగబడతారు. ఉద్యోగులు అప్పు చేస్తే.. వారి ఏటీఎంలు వడ్డీ వ్యాపారుల వద్ద ఉంచాల్సి వస్తోంది. అధిక వడ్డీ వ్యాపారులు తామిచ్చిన అప్పు కన్నా ఐదింతలు వడ్డీ రూపంలో తీసుకున్నా సరే.. ధన దాహం తీరదు. చెల్లింపులో ఎప్పుడైనా ఆలస్యమైతే రుణగ్రస్తుల బాధలు, కష్టాలు, పరిస్థితులను వినకుండా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. పాతూరులో వడ్డీ వ్యాపారి తిరుపాల్‌ నడిరోడ్డులో బాబ్జాన్‌ అనే వ్యక్తిపై దౌర్జన్యం చేసిన ఘటన తర్వాత దాదాపు వంద మంది బాధితులు వడ్డీవ్యాపారి వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు.

మామూళ్ల మత్తులో పోలీసులు

అనంతపురంలో భవానీ నగర్‌కు చెందిన ఓ సామాజిక వర్గం వారు నెలకు రూ.10 నుంచి రూ.40 వడ్డీలు వసూళ్లు చేస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. తలకు మించిన వడ్డీ భారం కట్టాలి. కట్టకపోతే అక్రమ కేసులు పెడతారు. కేసులు పెట్టించుకుని తమ కుటుంబ పరువు ఎందుకు పోగొట్టుకోవాలని సింహభాగం మంది లోలోన ఆవేదన చెందుతూ.. భారంగా వడ్డీలు కడుతున్నారు. ఒక్కసారి అప్పు చేసి ఊబిలోకి దిగితే.. బయటకు రావడం దాదాపు అసాధ్యమవుతోంది. వేలాది కుటుంబాలు ఈ అప్పుల బాధ తాళలేక చితికిపోయాయి. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా మామూళ్లకు అలవాటుపడి ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.

రూ.కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు

నగరంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిలో టీడీపీ నేతలు అధికంగా ఉన్నారు. వీరి వద్ద అప్పు తీసుకున్న వాళ్లు భయంతో వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తూ వీధిన పడుతున్నారు. పాతూరు, వినాయక్‌ నగర్‌, రాణినగర్‌, బుడ్డప్పనగర్‌, తదితర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారమే వృత్తిగా ఎంతో మంది రూ.కోట్లకు పడగలెత్తడం గమనార్హం.

కొత్త సీఐ ఎప్పుడొస్తారో?

అనంతపురంలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వడ్డీ వ్యాపారుల మాఫియా చెలరేగిపోతోంది. వడ్డీ వ్యాపారులు, మట్కా, గంజాయి బ్యాచ్‌ అధికంగా ఉండేది ఈ స్టేషన్‌ పరిధిలోనే. వీరి ఆగడాలను అరికట్టాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే కొంతమంది పోలీసులు అసాంఘిక శక్తులకే సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. జూన్‌ మొదటి వారం నుంచి సీఐ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కొత్త సీఐని నియమించలేదు.

నూటికి రూ.10 నుంచి రూ.40 వరకు వడ్డీ

చెల్లింపుల్లో ఆలస్యమైతే దూషణలు, దాడులే

శ్రుతిమించిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు

ఈ నెల 7న అనంతపురంలోని పాతూరులో తిరుపాల్‌, ఆయన కుమారులు సూరి, శేషు ముగ్గురూ కలిసి బంగారు వ్యాపారస్తుడు అయిన బాబ్జాన్‌ అనే వ్యక్తిపై దారుణంగా దాడిచేశారు. తిరుపాల్‌ వద్ద నుంచి బాబ్జాన్‌ నూటికి రూ.10 వడ్డీ ప్రకారం రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వడ్డీ రూపంలో ఇప్పటి వరకు దాదాపు రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ నెల వడ్డీ డబ్బులు సాయంత్రం ఇస్తానని చెప్పినప్పటికీ అతనిపై తండ్రీ కుమారులు దాడి చేశారు. నగరంలోని మహల్దార్‌స్ట్రీట్‌, భవానీనగర్‌లో తిరుపాల్‌ దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి.

ఈ నెల 9న వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక బుక్కరాయసముద్రం ఐలమ్మ కాలనీకి చెందిన మహబూబ్‌ బాషా అనే వ్యక్తి విషపుద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈయన రామాంజి అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. రూ.100కు రూ.10 వడ్డీ చొప్పున మూడు నెలలు సక్రమంగా చెల్లించాడు. తర్వాత అసలు, వడ్డీ తక్షణమే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై మహబూబ్‌ బాషా ఆత్మహత్యకు యత్నించినట్లు ఆయన భార్య ఫిర్యాదు చేశారు.

ఈ నెల 15న వడ్డీ వ్యాపారుల నుంచి ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని అనంతపురం అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న పి.వెంకట్రామిరెడ్డి, రేణుక దంపతులు ఎస్పీకి విన్నవించారు. తమ కుమారుడు అభిషేక్‌రెడ్డికి రూ.3.3 లక్షలు అప్పుగా ఇచ్చి.. రూ.5.60 లక్షలు కట్టించుకున్నారని, రూ.100కు వారానికి రూ.10 వడ్డీ చొప్పున తమకు తెలియకుండా తమ కుమారుడికి డబ్బు ఇచ్చి రికవరీ పేరిట పీడిస్తున్నారని తెలిపారు.

అధిక వడ్డీల కోసమే దాడులు

వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎంతలా అంటే పట్ట పగలే బహిరంగంగా దాడులు చేసేంత. పైకి కనిపించని దారుణాలు ఇంకా చాలా ఉన్నాయి. బాధితులు భయపడకుండా పోలీసుల స్టేషన్లను ఆశ్రయించాలి. అధిక వడ్డీ వ్యాపారస్తుల అరాచకాలను అడ్డుకోవడానికి బాధితుల పక్షాన అధిక వడ్డీల వ్యతిరేక పోరాట కమిటీ అండగా ఉంటుంది.

– సాకే హరి, అధిక వడ్డీల వ్యతిరేక పోరాట

కమిటీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement