
అహుడా పరిధిలో ల్యాండ్ బ్యాంక్ గుర్తించండి
అనంతపురం అర్బన్: అహుడా పరిధిలో ల్యాండ్ బ్యాంక్ గుర్తించాలని సంబంధిత అధికారులను పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వినోద్‌కుమార్, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, అలిమినేని సురేంద్రబాబు, రాష్ట్ర కార్మిక సంక్షేమబోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్‌తో కలిసి అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎంఐజీ లే అవుట్‌లను అభివృద్ధి చేసి ప్రజలకు కేటాయించాలన్నారు. కళ్యాణదుర్గం పరిధిలోని ఎస్సీ కాలనీల అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. అవసరమైన చోట డిప్యుటేషన్ ద్వారా నియమాకాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ రామ్మోహన్‌రెడ్డి, ఈఈ ఆదినారాయణ, నగర పాలక సంస్థ ఈఈ షాకీర్, టిడ్కో ఈఈ సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్టోబర్ 2 నాటికి చెత్త డంపులన్నీ తొలగిస్తాం
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలో డంపింగ్ యార్డుల్లో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోగా 55 లక్షల టన్నులను తొలగించామని, ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా డంపులన్నీ క్లియర్ చేస్తామని మంత్రి పి.నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని గుత్తి రోడ్డు కంపోస్టు యార్డులో రూ.12.21 కోట్లతో చేపట్టిన బయో రెమిడేషన్, బయోమైనింగ్ పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించి, మాట్లాడారు. రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి కేంద్రం వాటాతో పాటు అదే రోజునే రాష్ట్ర వాటా కలిపి ఇస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.
హోంగార్డు కుటుంబాలకు చేయూత
అనంతపురం: ఉమ్మడి జిల్లాలో గత నెల వేర్వేరు కారణాలతో మృతి చెందిన ముగ్గురు హోంగార్డులకు సంబంధించి వారి కుటుంబాలకు ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం ఆర్థిక చేయూతనందించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన హోంగార్డు బి.తిరుపాల్‌నాయక్ కుటుంబానికి జిల్లా హోంగార్డుల ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం రూ.4,33,200తో పాటు ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు, అనంతపురం జిల్లాలో పని చేస్తూ మరణించిన లక్ష్మీరెడ్డి కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు, శ్రీసత్యసాయి జిల్లా హోంగార్డుగా పనిచేస్తూ చనిపోయిన నరసింహులు కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు పవన్‌కుమార్, రాముడు, ఆర్‌ఎస్‌ఐ జాఫర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రీ పీహెచ్‌డీ పరీక్ష షెడ్యూల్ మార్పు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రీ పీహెచ్‌డీ పరీక్ష షెడ్యూల్‌ను మార్పు చేశారు. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. వెంకటరమణ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్ష నేపథ్యంలో ఈ మార్పు చేశారు. ఆగస్టు 5వ తేదీ రీసెర్చ్ మెథడాలజీ (పేపర్–1), 6న అడ్వాన్సెడ్ సబ్జెక్టు పేపర్/రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ద సబ్జెక్టు(పేపర్–2), 7న పేపర్ ఆన్ రీసెర్చ్ ఏరియా (పేపర్–3) పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.

అహుడా పరిధిలో ల్యాండ్ బ్యాంక్ గుర్తించండి