
కూటమి మోసాలను తిప్పికొడదాం
అనంతపురం కార్పొరేషన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విస్మరించడం ద్వారా ఏడాదిలో రూ.81వేల కోట్లు ప్రజలకు చెల్లించకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమర్థవంతంగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మనం చేసిన మేలును చెబుతూనే.. కూటమి దుశ్చర్యలను తిప్పికొట్టాలని సూచించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీకి సోషల్ మీడియా ఎంతో బలమన్నారు. మహిళలు, రైతులు, యువత, వివిధ వర్గాల వారు పడుతున్న ఇబ్బందులపై ప్రజలను చైతన్య పరిచేదిశగా పోస్టింగ్‌లు ఉండాలని సూచించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయాలకతీతంగా రూ.2.80 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా అందించిన విషయాన్ని ప్రజలకు తెలియజేద్దామన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వ పెద్దలు బరితెగించి అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తలకు అండగా లీగల్, టాస్క్‌ఫోర్స్ టీంలను పార్టీ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు ముందుకేయాలని పిలుపునిచ్చారు. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని అనంతపురంలో ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తున్నామని, బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్ కోడ్‌కు సంబంధించి విస్తృత స్థాయి ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.118 కోట్లు తెచ్చామని ప్రజాప్రతినిధులు గొప్పలు చెబుతున్నారని, ఇందుకు సంబంధించి ఏమైనా జీఓలు, ఉత్తర్వులను చూపమంటే కొంతమంది ఫస్ట్రేషన్‌తో విమర్శలు చేస్తున్నారన్నారు.
అండగా ఉంటాం..
కూటమి ఆగడాలను నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో దౌర్జన్యాలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ పేర్కొన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్‌నాథరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబా సలాం, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, తదితరులు మాట్లాదారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్, నాయకులు తనీష, కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రీకాలింగ్ చంద్రబాబూ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో చైతన్యం తెద్దాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకట్రామిరెడ్డి