క్రిప్టో మాటున లూటీ | - | Sakshi
Sakshi News home page

క్రిప్టో మాటున లూటీ

Jul 14 2025 4:49 AM | Updated on Jul 14 2025 4:49 AM

క్రిప్టో మాటున లూటీ

క్రిప్టో మాటున లూటీ

అనంతపురం: మరో ఆన్‌లైన్‌ మోసం వెలుగులోకి వచ్చింది. ‘లుక్‌’ యాప్‌ తరహాలోనే మాయగాళ్లు బురిడీ కొట్టించారు. క్రిప్టో మాటున రూ. కోట్లు లూటీ చేసినట్లు తెలిసింది. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్‌ కరెన్సీ. ఇది ఏ దేశానికీ చెందింది కాదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. ప్రభుత్వ నియంత్రణ కానీ, స్వతంత్ర సంస్థ అదుపులో కానీ ఉండదు. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య నేరుగా బదిలీ చేసుకోగల డిజిటల్‌ కరెన్సీ మాత్రమే. ఈ కరెన్సీకి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. కానీ కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన కొందరు వ్యక్తులు అనంతపురం నగరంలో పాగా వేసి వందలాది మందిని క్రిప్టో ముగ్గులోకి లాగారు. లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర డిపాజిట్‌ చేయించుకున్నారు. రూ. లక్ష కడితే రోజూ 15 నుంచి 20 అమెరికన్‌ డాలర్లు ఇస్తామని నమ్మబలికారు. మాయగాళ్ల ఉచ్చులో పడిన పలువురు వారు చెప్పినట్లుగానే డిపాజిట్లు చేశారు. మొదట్లో లాభాలు బాగానే రావడంతో తెలిసిన వారు, బంధువుల నుంచి కూడా డబ్బులు డిపాజిట్‌ చేయించారు. నిర్వాహకులు కేవలం వెబ్‌సైట్‌లోనే లావాదేవీలు నిర్వహించారు. ఓ ‘ఫండ్‌’ పేరుతో మొదలైన దందా.. రెండు నెలలకే పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్దిచెప్పారు. ఈ క్రమంలో డబ్బు డిపాజిట్‌ చేస్తే రెట్టింపు అవుతాయని ఆశ చూపించి.. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. తర్వాత ఒక్కసారిగా దుకాణం ఎత్తేశారు. ఉమ్మడి జిల్లాలో వందల మంది అమాయ కులు మోసపోయినట్లు తెలిసింది. బాధితుల్లో అధికంగా చిరు వ్యాపారులు ఉన్నట్లు సమాచారం.

రిటైర్డ్‌ ఉద్యోగికి భారీ బురిడీ..

అనంతపురంలో ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి క్రిప్టో కరెన్సీ మోజులో పడ్డారు. తొలుత భారీ ఆదాయం రావడంతో మరికొంత మందితో సభ్యత్వం కట్టిస్తే మరింత లాభం వస్తుందని ఆశ పడ్డాడు. బంధువులు, స్నేహితులు అందరికీ క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాడు. ‘నేను కోటి రూపాయల వరకు చెల్లించా. మీరు కూడా పెట్టండి.. మంచి లాభాలు వస్తాయి. ఏడాదికే డబుల్‌ ఆదాయం సొంతమవుతుంది’ అని వివరించాడు. తనకు లాభాలు వచ్చాయని ఆధారాలు సైతం చూపించాడు. దీంతో స్నేహితులంతా కలిసి రూ.5 కోట్లు పోగేశారు. విశాఖపట్నంకు వెళ్లి మరీ ఓ వ్యక్తికి నగదు ముట్టజెప్పారు. తాజాగా మొదటికే మోసం రావడంతో లబోదిబోమంటున్నట్లు తెలిసింది. విశాఖపట్నం ఏజెంట్‌ ఫోన్‌ నంబరు పనిచేయకపోవడంతో లోలోపలే కుమిలిపోతున్నట్లు సమాచారం.

క్రిప్టోలో చాలామంది పెట్టుబడులు..

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే.. డాలర్లలో సంపాదన ఉంటుందన్న ఆశ మధ్య తరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. క్రిప్టో పేరుతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తమ వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరీ ఇందులో పెట్టుబడులు పెట్టడంతో మొదటికే మోసం వస్తోంది. మొత్తం డబ్బు పోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. మోసపోయా మని చెబితే బంధువులు, సమాజంలో మర్యాద పోతుందని మిన్నకుండిపోతున్నారు.

వెలుగులోకి మరో మోసం

రూ.లక్ష కడితే రోజూ 20 యూఎస్‌ డాలర్లు అంటూ ఎర

కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి

మరీ కట్టిన అమాయకులు

తాజాగా జెండా ఎత్తేయడంతో

లబోదిబోమంటున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement