
రైతులతో చెలగాటం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడారు. ఖరీఫ్, రబీ ఆరంభం కాగానే కచ్చితమైన విధి విధానాలు,ప్రీమియం, కటాఫ్ తేదీలు ప్రకటించలేదు. ఈ క్రమంలో పంటల బీమా పథకంపై రైతుల్లో గందరగోళం నెలకొంది. ఎటూ పరిహారం ఇచ్చేది లేదనే ఉద్దేశంతో చెలగాటమాడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో అన్నదాతలకు ఇబ్బంది లేకుండా సాఫీగా అమలు చేసిన బీమా పథకంపై అంతులేని అలసత్వం ప్రదర్శిస్తూ చంద్రబాబు సర్కారు రైతులను దారుణంగా మోసం చేస్తోంది.
పంటల బీమా పథకంపై గందరగోళం
● ఇప్పటికే 60 శాతం పూర్తయిన పంట రుణాల రెన్యూవల్స్
● ప్రీమియం కట్టించుకున్న బ్యాంకర్లు
● కేవలం వేరుశనగకే వసూలు
● ఇటీవల పంటల వారీ బీమా ప్రీమియంపై వ్యవసాయశాఖ ప్రకటన
● ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం
అనంతపురం అగ్రికల్చర్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు సర్కారు అటకెక్కించిది. ప్రీమియం కట్టాలంటూ రైతులపై అదనపు భారం మోపింది. ఏటా ప్రీమియం రూపంలో రూ.150 కోట్ల వరకు రైతుల నుంచి దండుకునేందుకు ఎత్తులు వేసింది. కానీ పరిహారం విషయానికి వచ్చే సరికి చేతులెత్తేస్తోంది. 2023కు సంబంధించి 2024లో ఎగ్గొట్టింది. 2024 ఖరీఫ్‌కు సంబంధించి పరిహారం ఇవ్వకుండా దాటవేస్తోంది. నేడు ఖరీఫ్ 2025 బీమా పథకం అమలులోకి తెచ్చింది. ఇలా పంటల బీమా పథకం ప్రయోజనాలు రైతులకు దక్కకుండా మొక్కుబడి తంతుగా మార్చేసింది.
రెన్యూవల్స్ 60 శాతం పూర్తి..
పంట రుణాల రెన్యూవల్స్ సమయంలో రైతుల నుంచి పంటల వారీగా ప్రీమియం కట్టించుకోవాల్సి ఉంది. కానీ కొన్ని బ్యాంకుల్లో ప్రీమియం కట్టించుకోలేదు. మరికొన్ని బ్యాంకులు రైతుల నుంచి ప్రీమియం కట్టించుకుంటున్నా... ఎకరాకు రూ.640 ప్రకారం కేవలం వేరుశనగ పంటకు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పంటలు చేసినట్లు ఈ–క్రాప్‌లో వేరుశనగ నమోదైతే బీమా పథకం వర్తిస్తుంది. వేరే పంట వేస్తే సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 60 శాతం వరకు పంట రుణాల రెన్యూవల్స్ పూర్తయ్యాయి. ఇలా... 60 శాతం రెన్యూవల్స్ పూర్తయిన తర్వాత నాలుగు రోజుల క్రితం వ్యవసాయశాఖ పంటల వారీగా ప్రీమియం కట్టాలంటూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అటు కూటమి ఇటు వ్యవసాయశాఖ వ్యవహరిస్తుండటంతో రైతులకు పరిహారం దక్కే పరిస్థితి కనిపించడం లేదు.
12 పంటలకు..
కాగా ఈ ఖరీఫ్‌లో పంట దిగుబడుల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరప పంటలకు బీమా పథకం వర్తింపజేశారు. ఇందులో కంది రైతులు ఎకరాకు 80 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వరి రైతులు రూ.164, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదం రూ.80, ఎండుమిరప రూ.576 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. ఇక వాతావరణ బీమా పథకం కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటికి వర్తింపజేశారు. ఇందులో వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం ప్రీమియం కట్టాలి. పత్తికి రూ.1,140, దానిమ్మ రూ.3,750, చీనీ, బత్తాయి రూ.2,750, టమాట రూ.1,600, అరటి రూ.3 వేల ప్రకారం ప్రీమియం కట్టాలంటూ ఇటీవల వ్యవసాయశాఖ ప్రకటన విడుదల చేసింది. పంట రుణాలు తీసుకోని రైతులు ప్రత్యేకంగా కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్‌సీ), అలాగే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)లో ప్రీమియం కట్టాలని సూచించారు. వాతావరణ బీమా కింద చేర్చిన పంటలకు ఈనెల 15వ తేదీలోపు ప్రీమియం కట్టాలని నాలుగు రోజుల కింద ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రైతుల సంక్షేమం పట్ల కూటమి సర్కారు, వ్యవసాయ శాఖ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.