
‘ఆశల్ని’ ఆపేశారు!
బొమ్మనహాళ్: రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ముందస్తుగా నీరొచ్చాయని పడిన సంతోషాన్ని ఆదిలోనే దూరం చేశారు. గంగపూజ నిర్వహించి స్వాగతించాల్సిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఈనెల 10న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105–272 కిలోమీటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. అయితే, హెచ్చెల్సీలో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతుండడంతో వాటికి ఇబ్బంది లేకుండా 105వ కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్ గేట్లు కిందికి దించి నీరు ఆంధ్రాలోకి ప్రవేశించకుండా ఆపేశారు.
పర్యవేక్షణ కరువై ఇష్టారాజ్యం..
కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా హెచ్చెల్సీలో మరమ్మతు పనులు అనుకున్నట్లుగా సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 115 నుంచి 138 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు, నాగలాపురం వద్ద, ఉద్దేహాళ్–మల్లికేతి మార్గంలో బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పనుల పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ నీటిని ఆంధ్రా సరిహద్దులోనే ఆపేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతులు బోర్ల కింద వరి, మిరప నార్లు పోసుకున్నారు. తుంగభద్ర నీరు వచ్చి ఉంటే నారుకు బాగుండేదని, బోరు నీటికి నారు ఎర్రగా మారుతోందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించి తమకు సాంత్వన చేకూర్చాలని కోరుతున్నారు.
అధికారుల అలసత్వం..
రైతులకు అశనిపాతం
హెచ్చెల్సీలో పూర్తి కాని
మరమ్మతు పనులు
సరిహద్దులో ఆగిన
తుంగభద్ర జలాలు