
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమర్పించిన అర్జీల స్థితిని 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలిపారు.
నేడు యల్లనూరులో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’
యల్లనూరు: శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో సోమ, మంగళవారాల్లో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటలకు యల్లనూరులో కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఏడాది సీఎం చంద్రబాబు పాలనలో ఎన్ని హామీలు అమలయ్యాయి.. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనే వివరాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అరాచకాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మొదటి రోజు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రేపు తాడిపత్రిలో..
తాడిపత్రిటౌన్: పట్టణంలోని పాత వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్‌రెడ్డితోపాటు జిల్లాలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా స్థాయి నాయకులు హాజరవుతారన్నారు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’