
నేడు హెచ్చెల్సీకి నీటి విడుదల
బొమ్మనహాళ్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి గురువారం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)తో పాటు దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. దీనిపై గత నెల 27న బెంగళూరులోని విధానసౌధలో జరిగిన 124వ నీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ఈ నెల 10 నుంచి నవంబర్ 30 వరకూ ఏపీ, కర్ణాటక ఇరు రాష్ట్రాల కోటా నీరు కలిపి దాదాపు 1,300 క్యూసెక్కులు వదలనున్నారు. కొత్త క్రస్టు గేట్ల ఏర్పాటు నేపథ్యంలో ఖరీఫ్‌కు మాత్రమే నీరివ్వనున్నారు.
కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
బుధవారం కూడా తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగింది. ఈ క్రమంలో డ్యాం 16 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 45,280 క్యూసెక్కులు నదికి, మరో 7,400 క్యూసెక్కుల మేర కాలువలకు వదులుతున్నారు. మొత్తంగా ఇన్‌ఫ్లో 51,955 కూసెక్కులు, అవుట్‌ఫ్లో 52,678 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాలైన వరనాడు, శివమొగ్గ, మలేనాడు, ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లి, కొప్పి, చిక్ మగళూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,624.80 అడుగుల వద్ద 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను 75.837 టీఎంసీల నీరు ఉంది.
ఉపాధ్యాయుడి బలవన్మరణం
అనంతపురం సిటీ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి సమీపంలోని బొడాయిపల్లికి చెందిన కుమ్మెత అంకిరెడ్డి (45)కి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాక్షిక అంధత్వం కోటా కింద ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన మొన్నటి వరకూ బుక్కరాయసముద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పండిట్‌గా పనిచేశారు. గత నెల జరిగిన బదిలీల్లో భాగంగా అదే మండలం సిద్ధరాంపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీ అయ్యారు. అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్ 3వ క్రాస్‌లో నివాసముంటూ రోజూ పాఠశాలకు విధులకు వెళ్లి వచ్చేవారు. మొదటి కుమారుడు జ్ఞానదీపరెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. రెండో కుమారుడు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మానసిక క్షోభకు గురైన అంకిరెడ్డి బుధవారం తెల్లవారుజామున ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా భావించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అంకిరెడ్డిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నేడు హెచ్చెల్సీకి నీటి విడుదల