
టీబీ డ్యాంకు కొత్త శోభ..
విద్యుద్దీపాల వెలుగులో తుంగభద్ర జలాశయం
బొమ్మనహాళ్: తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో టీబీ డ్యాం కొత్త శోభ సంతరించుకుంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం 19 క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని నదికి వదులుతున్నారు. ఆదివారం 54,815 క్యూసెక్కులు నదికి, 6 వేల క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు పంపారు. డ్యాంలో 77 టీఎంసీలు నిల్వ ఉంచి, మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు. మరో 4 రోజుల్లో హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు వరినార్లతో పాటు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.21 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 52,805 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 62,027 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 77.180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,593.19 అడుగుల వద్ద 13.900 టీఎంసీల నీటి నిల్వతో, 25,556 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 190 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండిందని అధికారులు తెలిపారు.