
జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసులా?
చెన్నేకొత్తపల్లి: ‘‘ టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గత నెల 8న హెలికాప్టర్‌లో తమ నాయకుడు వైఎస్ జగన్ వస్తే హెలిప్యాడ్ వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రజలు హెలికాప్టర్ వరకూ దూసుకెళ్లారు. నేనే మైక్ తీసుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాను. అయినా అభిమానులు దూసుకెళ్లడంతో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే. కానీ జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసు పెట్టారు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి సోమవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగమయ్యను అగ్రకులాలకు చెందిన వారు కొందరు హత్య చేసినా.. వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, బంధువులు హస్తం ఉందని తోపుదుర్తి ఆరోపించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవలు జరిగాయని, తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడిన వారితో కలిశారన్నారు. ఈ విషయాన్ని కొన్ని మీడియాలు తప్పుదోవ పట్టించే విధంగా రకరకాలుగా ప్రసారం చేశాయన్నారు. వాస్తవాన్ని వదలి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎక్కువ జనం రావడంతో పోలీసు ఉన్నతాధికారి సూచన మేరకు తాను మైక్ ద్వారా సంయమనం పాటించాలని హెలిప్యాడ్ వద్దకు వెళ్లరాదని సూచించారన్నారు. ఇవన్నీ వదిలి నాపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం మాని, రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రకాష్‌రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు ఉన్నారు.
పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన
పోలీసుల వైఫల్యమే
సంబంధం లేని నాపై కేసు పెట్టారు
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి